న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వందేభారత్ రైళ్ల తయారీ కోసం పిలిచిన టెండర్లకు రష్యన్ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక – రాజకీయ పరిస్థితుల్లో రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోవాలని భారత్‌పై ఒత్తిడి పెరుగుతున్న దశలో వందేభారత్ రైళ్ల తయారీ కాంట్రాక్టును రష్యన్ కంపెనీ గెలుచుకుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. రష్యాకు చెందిన జేఎస్సీ మెట్రోవ్యాగన్మ్యాష్ సంస్థ భారత ప్రభుత్వానికి చెందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్లో టెండర్లు దాఖలు చేయగా, మరో రష్యన్ సంస్థ జాయింట్ స్టాక్ కంపెనీ లోకోమోటివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ విడిగా టెండర్ దాఖలు చేసిందని తెలిపారు. 2022 నవంబర్ 30న దాఖలైన ఈ టెండర్లు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయని వెల్లడించారు.