హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి టెండర్లు పిలిచామని, త్వరలో ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం భూ కేటాయింపు ఆలస్యం చేయడంతో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జాప్యం జరిగిందన్నారు. ఇటీవల భూమిని రైల్వే శాఖకు అప్పగించారని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీలకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు అరవింద్, సోయం బాబురావు తదితరులతో కలిసి మీడియాతో మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడారు.. 2009-2014 వరకు తెలంగాణను యూపీఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రైల్వే పనులకు సంబంధించి ఉమ్మడి ఏపీలో రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రైల్వే డబ్లింగ్ పనులైతే ఒక్కటి కూడా చేపట్టలేదన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో రైల్వే శాఖ చేపట్టిన వివిధ పనులకు రూ.1,110 కోట్లను మోడీ సర్కార్ కేటాయించిందని ఆయన చెప్పారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో మోడీ సర్కార్ రూ.3048 కోట్లను తెలంగాణకు కేటాయించిందన్నారు. తెలంగాణలోని రైల్వే స్టేషన్లు అభివృద్ధి, రైల్వే డబ్లింగ్, త్రిబ్లింగ్ పనులకు అదనంగా నిధులను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం 24 కిలోమీటర్ల డబ్లింగ్, త్రిబ్లింగ్ కేటాయిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎంఎంటిఎస్ పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించడం లేదన్నారు. ఎంఎంటిఎస్ కోసం కేంద్రం తన వాటాగా రాష్ట్రానికి రూ.631 కోట్లు కేటాయించిందన్నారు.
వలిగొండలో రైళ్ళు ఆపాలి..
రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కి బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలోవలిగొండ మండల నాయకులు వినతిపత్రాన్ని అందించారు. వలిగొండ రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, జన్మభూమి, నర్సాపూర్, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్ళను ఆపడానికి అనుమతి ఇప్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. మండల కేంద్రంలో రైలు ఆపడం వలన ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, అదే విధంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళే విద్యార్థులకు, వ్యాపారస్థులకు, ఉద్యోగులకు, రైతులకు సౌకర్యంగాఉంటుందని మంత్రికి వారు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..