Friday, November 22, 2024

ప్రతి పంచాయతీకి పది వేల మొక్కలు.. త్వరలో 8.76 లక్షల మొక్కలతో 8వ విడత హరితహారం..

పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణకు హరితహారంలో భాగంగా ఈసారి ప్రతి పంచాయతీలో పది నుంచి పన్నెండు వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడటంతో ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. మొత్తం 19.50 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ 8.76 లక్షల మొక్కలను నాటనుంది. ఒక్కో గ్రామపంచాయతీలో స్థలం లభ్యత అనుగుణంగా పది నుంచి పన్నెండు వేల వరకు మొక్కలను నాటనున్నారు. ఖాళీ స్థలాలు, సాగునీటి కాలువల వెంబడి కనీసం ఐదు ఏడుగుల ఎత్తున్న పెద్ద మొక్కలను నాటే విధంగా ప్రణాళిక రూపొందించారు. సుమారు పది వేల ఎకరాల ఖాళీ స్థలం, నాలుగు వేల కిలో మీటర్ల మేర కాలువ గట్లు, తొమ్మిది వేల కిలో మీటర్ల మేర పంచాయతీరాజ్‌ రోడ్లతో పాటు గ్రామాలను అనుసంధానించబడిన రాష్ట్ర, జాతీయ రహదార్ల వెంబడి ఇరుపక్కల మొక్కలను నాటనున్నారు.

అలాగే గ్రామాల్లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న క్రీడా మైనాలలో విరివిగా మొక్కలు నాటి గ్రీన్‌వాల్స్‌ రూపొందించనున్నారు. గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ మొక్కలను పంపిణీ చేయనుంది. ఈసారి ఎర్రచందనం మొక్కలను అధికంగా పంపిణీ చేయనున్నారు. గత ఎడాది ఇంటింటికి తిరిగి ఇచ్చిన ఆరు మొక్కలు బతికి ఉంటే ఈసారి ఇవ్వకూడదని నిర్ణయించారు. గత ఏడేళ్ళుగా కొనసాగుతోన్న హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామం, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్‌సీలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటారు. ఈసారి కూడా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలను నాటనున్నట్లు అధికారులు చెబుతున్నారు. హరితహారం కార్యక్రమాన్ని రొటీన్‌ కార్యక్రమంగా తేలికగా తీసుకోవద్దని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు సూచించారు. గత ఏడేళ్ళుగా ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత మేర బతికే అవకాశమున్న పెద్ద మొక్కలను నేల స్వభావంను బట్టి నాటాలని నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement