జాతీయ జననాల రేటు, వివాహాల రేటు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో యువ వధువులకు 1,000 యువాన్లు (రూ.11,300) రివార్డును ఇవ్వాలని చైనాలో జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కౌంటీ నిర్ణయించింది. మరీ ముఖ్యంగా వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చే 25 సంవత్సరాల లోపు యువతులకు నగదు బహుమానం ఇవ్వాలని తీర్మానించింది. అంతేకాకుండా సరైన వయస్సులో వివాహం చేసుకున్న జంటలకు సంతానం, పిల్లల సంరక్షణ, విద్య వంటి విషయాల్లో రాయితీలను కల్పిస్తామని ప్రకటించింది. చైనాలో వివాహ వయోపరిమితి పురుషులకు 22 సంవత్సరాలు, మహిళలకు 20 సంవత్సరాలుగా ఉంది.
అయితే వివాహాల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో పాటు జననాల రేటు పడిపోయింది. 2022లో వివాహాల రేటు అత్యల్పంగా 68 లక్షలుగా నమోదైంది. ఇది గత 25 సంవత్సరాల్లో అత్యంత కనిష్టమైన రేటుగా ఉంది. 2020లో ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రకారం 2019లో దాదాపు 1.2 కోట్ల మంది శిశువులు జన్మించారు. ఇది 1960 నాటి నుంచి నమోదైన జననాల రేటులో అత్యంత కనిష్టంగా నమోదైంది. 2016లో జన్మించిన మొత్తం శిశువుల కన్నా దాదాపు 60 లక్షలు తక్కువగా 2020లో శిశువులు జన్మించారు. ఈ నేపథ్యంలో యువతులను వివాహం వైపు మొగ్గు చూపేలా చేయడానికి చాంగ్షాన్ కౌంటీ రివార్డు ప్రకటించింది.