హమాస్ ఉగ్రవాదులతో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనున్నారు. అయితే అక్టోబర్ 7వ తేదీన తమ చెరలోకి తీసుకున్న బందీలను..కాల్పుల విరమణ నేపథ్యంలో విడిచిపెట్టేందుకు హమాస్ సిద్దమైనట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది బందీలను విడుదల చేసేందుకు హమాస్ కూడా అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. ప్రధాని బెంజిమన్ నెతన్యూ నేతృత్వంలోని క్యాబినెట్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఒప్పందం ప్రకారం కనీసం 50 మంది ఇజ్రాయిలీ, విదేశీ బందీలను రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఒకవేళ అదనంగా 10 మందిని విడుదల చేస్తే, అప్పుడు కాల్పుల విరమణను మరో రోజు పొడిగించనున్నట్లు ఇజ్రాయిల్ చెప్పింది.
ఇజ్రాయిల్ ఇచ్చిన ఆఫర్‌ను హమాస్ స్వాగతించింది. దీని వల్ల ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న సుమారు 150 మంది పాలస్తీనియన్లను కూడా విడిచిపెడుతారని భావిస్తున్నట్లు హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. హమాస్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలై ఏడు వారాలు దాటింది. ఆ యుద్ధం వల్ల స్థానిక జనం తీవ్ర నిస్తేజంలో ఉన్నారు. అయితే కాల్పుల విమరణ సమయంలో స్థానిక ప్రజలు కొంత సేద తీరే అవకాశాలు ఉన్నాయి. గ్రౌండ్ ఆపరేషన్‌తో పాటు వైమానిక దళ దాడులను కూడా కాల్పుల విరమణ సమయంలో నిలిపివేయనున్నారు.