Monday, November 25, 2024

మరో ఊరట, 3వేల కోట్ల రుణానికి తాత్కాలిక అనుమతి.. మంగళవారం బాండ్ల వేలం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మరో రూ.3వేల కోట్ల రుణ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. అప్పుల కోసం తెలంగాణ అనేక ఇబ్బందులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. రెండు నెలల విరామం తర్వాత ఈ నెల మొదటి వారంలో రూ.4వేల కోట్ల రుణ సేకరణకు అడ్‌హక్‌ ఆమోదం తెలిపిన కేంద్రం తాజాగా వచ్చే మంగళవారం మరో రూ.3వేల కోట్ల రుణ సేకరణకు ఆర్భీఐకి అనుమతించింది. రూ.1000 కోట్ల చొప్పున 12, 13, 14 ఏళ్ల కాలపరిమితితో బాండ్ల వేలానికి సమ్మతించింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ వెలుపల తీసుకున్న కార్పొరేషన్ల రుణాలను 2020-21, 2021-22ఏడాదులకు చెందిన అప్పులను ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎంలో కలుపుతామని చెప్పిన కేంద్రం గడచిన రెండు నెలలు అప్పులకు అనుమతించలేదు. ఫలితంగా ఏప్రిల్‌, మే నెలల్లో ప్రభుత్వం అప్పులు చేయకుండా కేంద్రం నిలువరించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులను, సర్దుబాట్లను, జీతాలు, పింఛన్ల చెల్లింపులు, అత్యవసర ఆర్ధిక అవసరాలతో కూడిన సమగ్ర నివేదికను ఆర్ధిక శాఖ ప్రభుత్వానికి పంపించింది. ఈ నెలలో రూ. 14వేల కోట్లకుపైగా ఖర్చులు, అదనంగా మరో రూ. 7600కోట్ల రైతుబంధు నిధులు సమీకరించుకోవాలని కోరింది, మే నెలకు చెందిన వేతనాలు, ఉద్యోగుల పింఛన్లు, వడ్డీ చెల్లింపులు, జూన్‌లో చెల్లించాల్సిన కొంత మేర అసలు, వడ్డీలు, సబ్సిడీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఆర్ధిక శాఖ సీఎం కేసీఆర్‌కు పంపినట్లు తెలిసింది. కాగా ఆర్ధిక శాఖ మాత్రం ఈ నెలలో రూ. 4వేల కోట్ల రుణాలు అందొచ్చని, మిగతా మొత్తాలను సొంత వనరుల రాబడి, పన్నేతర ఆదాయాల రూపంలో సమీకరించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఈ నెలలో రుణాల చెల్లింపులకు, వడ్డీలకు రూ. 3500కోట్లు, రైతుబంధు రూ. 7500కోట్లు, పించన్లు, వేతనాలు, సబ్సిడీలు, ఆసరా వంటి పథకాలకు నిధులను సమన్వయంతో సర్దుబాటు చేసుకోవాలని చూస్తోంది. ఇందుకు వేజ్‌ అండ్‌ మీన్స్‌, చే బదుళ్లు, ఇతర మార్గాల్లో రూ. 1700కోట్లకు అవకాశాలున్నాయి. గ్యారంటీ అప్పులను ఎఫ్‌ఆర్‌బీం పరిధిలోకి తీసుకురావొద్దని తెలంగాణ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తులు చేసింది. వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులను తీర్చే స్థోమత ఆయా కార్పొరేషన్లకు ఉందని, త్వరలో చెల్లింపులు చేస్తామని, మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న అప్పులను తాగునీటికి మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయితీలు బిల్లుల రూపంలో చెల్లిస్తాయని పేర్కొంది. ఈ నిధులతో కార్పొరేషన్ల అప్పులు తీరుతాయని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌ అప్పులను ఈ ప్రాజెక్టు సరఫరా చేసే నీటిని వినియోగిస్తున్న కంపెనీలే, పరిశ్రమలు బిల్లులద్వారా తీసుకొని చెల్లించనున్నట్లు కేంద్రానికి స్పష్టం చేశారు. స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాలను రహదారుల టోల్‌ట్యాక్స్‌ ద్వారా తీర్చివేయనున్నామని పేర్కొంది. మిగిలిన కార్పొరేషన్ల పనులు తుదిదశలో ఉన్నాయని, అవి పూర్తవగానే రాబడి పెరిగి అప్పులను తీర్చే మార్గాలు పెరుగుతాయని పేర్కొంది. అకస్మాత్తుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి ఈ అప్పులను తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం చేయడాన్ని ప్రభుత్వం తప్పుపడుతోంది.

ఈ ఆర్ధిక ఏడాది తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలంతో రుణం సమీకరించుకున్నది. రూ. 4వేల కోట్ల రుణాలను 13ఏళ్ల కాలానికి బాండ్లను విక్రయించడంద్వారా అప్పు తీసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలంగాణకు మంగళవారం రూ. 4వేలకోట్ల రుణం లభించింది. ఈ ఆర్ధిక యేడాది తొలి త్రైమాసికంలో తొలిసారిగా ఆర్భీఐ బాండ్ల వేలంలో రుణ సమీకరణ సాకారమైంది. గడచిన రెండు నెలల నిరీక్షణ తర్వాత తాత్కాలిక రుణ సమీకరణకు ఆర్భీఐ ఆమోదముద్రతో ఈ నెల తొలివారంలో బాండ్ల వేలంలో పాల్గొన్నది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement