తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. కాగా, తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, ఖమ్మం జిల్లా మధిర, జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 38.9 డిగ్రీలు, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని.. ఎండ నుంచి రక్షణ దుస్తులు ధరించాలని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలని, డీహైడ్రేషన్ కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.