ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై భానుడు ప్రతాపం చూపించనున్నాడు. ఇప్పటికే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సాధారణంగా మార్చి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు, భారత వాతావరణ శాఖ (IMD) కూడా వేసవిలో ఎండల గురించి హెచ్చరిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు మరిన్ని రోజులు ఎండలు, వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.
ఎల్ నినో ప్రభావమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. అందుకే ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. మార్చి- మే నెలల మధ్య, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణ గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది.
మరోవైపు దేశంలో లా నినా పరిస్థితులపై ఐఎండీ అంచనా వేసింది. లా నినా అనేది వర్షపాతానికి అనుకూలంగా ఉంటుంది. లా నినా వర్షాకాలం మధ్యలో ఏర్పడుతుందని అంచనా వేసింది. దేశంలో మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.