హైదరాబాద్‌కు చెందిన గిర్రెడ్డి వివేక్ అనే యువకుడు అమెరికాలో తన సత్తా చాటాడు. ప్రస్తుతం అమెరికాలోని జార్జియా టెక్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్న అతడిని అత్యుత్తమ ఉద్యోగం వరించింది. గత ఏడాది జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అమెజాన్ కంపెనీలో వివేక్ ఉద్యోగం సంపాదించాడు. రూ.1.5 కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్‌లో సీనియర్ ఫైనాన్షియల్ ఎనలిస్టుగా వివేక్ ఎంపికయ్యాడు. వివేక్ తండ్రి జీఎస్ రెడ్డి ఉద్యోగ రీత్యా ముంబైలో ఉండటంతో వివేక్ తన విద్యాభ్యాసమంతా అక్కడి డాన్ బాస్కో స్కూలులో పూర్తి చేశాడు. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బీఏ ఫస్టియర్ చదివాడు. అనంతరం కెనడా వెళ్లి మెక్‌గిల్ యూనివర్సిటీలో మిగతా మూడేళ్లు అభ్యసించాడు.
బీఏ పూర్తి చేసిన అనంతరం వివేక్ బెంగళూరులోని గోల్డ్‌మాన్ శాక్స్ కంపెనీలో మూడేళ్ల పాటు ఉద్యోగం చేశాడు. ఎంబీఏ చదవాలన్న ఆకాంక్షతో జీమ్యాట్ రాసి 94 పర్సంటైల్ సాధించాడు. అనంతరం స్కాలర్‌షిప్ సంపాదించి అమెరికాలో జార్జియా టెక్ యూనివర్సిటీలో రెండేళ్ల ఎంబీఏ కోర్సు చేశాడు. తొలి ఏడాది పూర్తయిన సమయంలోనే 12 వారాల పాటు అమెజాన్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేశాడు. దీంతో ఎంబీఏ పూర్తయ్యాక అదే కంపెనీలో అత్యుత్తమ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. కాగా ఈ ఏడాది జూన్ 21న సియాటెల్‌లోని అమెజాన్ కార్యాలయంలో వివేక్ విధుల్లో చేరనున్నాడు.