Friday, November 22, 2024

Delhi | ‘ఆపరేషన్ కావేరి’లో ఏపీ, తెలంగాణ.. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సూడాన్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరి’లో రెండు తెలుగు రాష్ట్రాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. అంతర్యుద్ధంలో గురితప్పిన తూటా తగిలి ఇప్పటికే ఒక భారతీయుడు మృతి చెందిన ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెనువెంటనే యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ సహాయ చర్యలకు ‘ఆపరేషన్ కావేరి’గా నామకరణం చేసిన ప్రధాన మంత్రి త్రివిధ దళాలను రంగంలోకి దించారు.

సూడాన్ సముద్ర తీర పట్టణం పోర్ట్ సూడాన్‌కు భారతీయులను తరలించి, అక్కణ్ణుంచి నావికాదళానికి చెందిన INS-సుమేధ ద్వారా 278 మంది సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి చేర్చారు. పోర్ట్ సూడాన్ విమానాశ్రయం నుంచి భారత వాయుసేనకు చెందిన సీ-130జే విమానం ద్వారా 250 మందికి పైగా భారతీయులను జెడ్డా విమానాశ్రయానికి చేర్చారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను జెడ్డా చేరుకున్న భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ పర్యవేక్షిస్తున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వ సహకారంతో ఈ ఆపరేషన్ జరుగుతోంది. జెడ్డా నుంచి ఇండియన్ ఆర్మీ, వాయుసేన విమానాలతో పాటు కమర్షియల్ విమానాల్లోనూ భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆ క్రమంలో 360 మంది భారతీయులతో ఒక విమానం జెడ్డా నుంచి బయల్దేరి రాత్రి గం. 9.00కు ఢిల్లీ చేరుకుంది. విమానం బయల్దేరే ముందు భారతీయులతో కేంద్ర మంత్రి మురళీధరన్ మాట్లాడారు.

తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్
ఆపరేషన్ కావేరిపై విదేశీ వ్యవహారాల శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఢిల్లీలోని ఆయా రాష్ట్రాల భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు సమాచారం అందజేసింది. భారత్‌కు తరలిస్తున్నవారిలో తమ తమ రాష్ట్రాలకు చెందినవారిని గుర్తించి, వారిని తమ స్వస్థలాలకు చేర్చే బాధ్యతను ఆయా రాష్ట్రాలు చేపట్టాల్సిందిగా సూచించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ సమీక్ష నిర్వహించారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నుంచి తరలించిన భారతీయుల్లో తెలుగువారి కోసం చేసిన ఏర్పాట్ల తరహాలో సూడాన్ నుంచి తీసుకొస్తున్న భారతీయుల్లోని తెలుగువారికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ సైతం ఈ తరహా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. ఢిల్లీ చేరుకున్నవారికి భోజనం, వసతితో పాటు వారిని హైదరాబాద్ వరకు చేర్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని వెల్లడించారు. విదేశీ వ్యవహారాల శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. బుధవారం చేరుకున్న విమానంలో సుమారు నలుగురు తెలంగాణవాసులు ఉండొచ్చని అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement