Tuesday, November 19, 2024

ప్ర‌చారాలు క్లోజ్..ప్ర‌లోభాలు స్టార్ట్..

నేటి వ‌ర‌కు హోరా హోరీగా జ‌రిగిన ప్ర‌చారాల‌కి తెర ప‌డ‌నుంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ..తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఏపీలో బ‌ద్వేల్..తెలంగాణ‌లో హుజూరాబాద్ కి ఈ నెల 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో హుజూరాబాద్‌లో బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి ఈసీ అనుమతినివ్వగా.. బద్వేల్ లో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నాయకులు మాటల తూటాలతో రాజకీయాలను వెడెక్కించారు.

ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రచారాన్ని షురూ చేశాయి. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. టిఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ వెంట గ్రామ గ్రామాన తిరుగుతూ మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కూడా ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఈటల గెలుపు కోసం పార్టీ అగ్రనేతలందరూ నియోజవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈటల, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, విజయశాంతి తదితర నాయకులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న బల్మూరి వెంకట్ గెలుపుకోసం కాంగ్రెస్ నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారాల‌తో హోరెత్త‌గా..ఇక‌పై ప్రలోభాల పర్వం మొద‌ల‌వుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

కాగా ఏపీలో బద్వేల్‌ ఉపఎన్నిక ప్రచారానికి కూడా నేటితో తెరపడనుంది.ఈ ప్రచార పర్వంలో అధికార వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన అగ్ర నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాటల తూటాలతో వేడెక్కించారు. అధికార పార్టీ వైసీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరుపున పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వ‌రితో పాటు ప‌లువురు నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నిక‌లకి టిడిపి..జ‌న‌సేన దూరంగా ఉండ‌టం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement