న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ పోలీసు విభాగంలో ఉగ్రవాదం సహా వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడం కోసం ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఉందకోటి రాముడు మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ఉగ్రవాదులను పట్టుకోవడంలో చురుగ్గా విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాముడుకు తాజాగా మెరిటోరియస్ సర్వీసెస్ కింద మెడల్ లభించింది. ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ ఏర్పడి 50 సంవత్సరాలైన సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు. 1994లో ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన రాముడు, మొదట్లో కీర్తినగర్ పోలీస్ స్టేషన్, పశ్చిమ ఢిల్లీ స్పెషల్ స్టాఫ్ విభాగాల్లో పనిచేశారు. ఆ సమయంలో నకిలీ నోట్ల ముఠాలను, గ్యాంగ్స్టర్లను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహించారు.
దీంతో కమిషనర్ ఆయన్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో చేర్చారు. చేరిన 4 నెలలకే కరుడుగట్టిన ఉగ్రవాదులను పట్టుకోవడంతో హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. ఉగ్రవాద సంబంధిత కేసుల్లో చురుగ్గా పనిచేస్తున్న రాముడును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డిప్యుటేషన్‌పై తీసుకోగా, 2012 నుంచి 2017 వరకు హైదరాబాద్ ఎన్ఐఏ విభాగంలో పనిచేశారు. 2013లో దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల కేసులో నిందితులను పట్టుకునేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించారు. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన యాసీన్ భత్కల్, అతని సన్నిహితులను బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడేలా చేయడంలో రాముడు సేకరించిన సాక్ష్యాధారాలు కీలకంగా మారాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.