రాజకీయాల్లో ముందుచూపు చాలా అవసరం. అదే లేకపోతే అప్పటి వరకు ఎంతో కష్టపడి నిర్మించుకున్న నేతల రాజకీయ కోటలు పునాధులతో సహా కూలిపోయే ప్రమాదాలు ఉన్నాయి. 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన జ్యోతుల నెహ్రూ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. 1999 లో జగ్గంపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తరువాత పలుమార్లు పార్టీ కండువాలు మార్చారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తొలిత ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీను వీడి ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో ఆ పార్టీ తరపున నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం తరువాత ఆయన రాజకీయ భవిష్యత్ డైలామాలో పడిందని ఆయన అనుచరులు వాపోతున్నారు.
ఇటీవల పరిషత్ ఎన్నికలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంతో ఆయనతో జ్యోతుల నెహ్రూ విభేదించారు. అనంతరం అటు నియోజకవర్గంలో, ఇటు పార్టీలోనూ తీవ్ర విభేదాలు వచ్చిన కారణంగా పార్టీ ఉపాధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. దీంతో ఆయనను పార్టీ దూరంగా పెడుతోంది. ఈ నేపథ్యంలో తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం ఇప్పుడు జనసేనలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. తన కొడుక్కి కాకినాడ ఎంపీ టికెట్ హామీ తీసుకుని ఆ పార్టీలో చేరేందుకు జ్యోతుల నెహ్రూ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. తిరిగి వైసీపీలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఉన్న వాటిల్లో కాస్త బెటర్‌గా ఉన్న జనసేనలోకి జంప్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.