Friday, November 22, 2024

ఖజానాకు కిక్కిచ్చే ఉపాయం చెప్పండి.. యువతకు జపాన్‌ ప్రభుత్వం వేడుకోలు

జపాన్‌ దేశానికి కొత్త సమస్య వచ్చిపడింది. కీలక ఆదాయ వనరైన ఆల్కహాల్‌ మార్కెట్‌ బాగా క్షీణించింది. ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వానికి ఇదే ప్రధాన రాబడిమార్గం. ఇప్పుడిది బక్కచిక్కడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఏదేమైనా మళ్లి ఖజానాకు కిక్కివ్వాల్సిందేనని ట్యాక్స్‌ ఏజెన్సీని ఆదేశించింది. దీంతో వారేమో యువత వెంటబడ్డారు. మీరు బాగా తాగండి.. మీ తోటివారిని తాగించండి.. మీకు కిక్కు రావాలంటే ఏంచేయాలో కూడా చెప్పండి. కొత్త కొత్త ఐడియాలు పంచుకోండి. దేశం కోసం కాస్త సాయం చేసిపెట్టండి అంటూ ఏకంగా ఓ ప్రచారానికే తెరలేపారు. జాతీయ స్థాయిలో వినూత్న పోటీని నిర్వహిస్తున్నారు. సహజంగానే జపాన్‌ యువత హుందాగా ఉంటారు. అలాంటి వారిని ఏదో ఒక కొత్త ప్రచారంతో మద్యం ప్రియులుగా మార్చాలని అధికారులు భావిస్తున్నారు. యువతరం వారి తల్లిదండ్రుల కంటే తక్కువ మద్యం తాగుతోంది. ఇది సాక్‌ (రైస్‌వైన్‌) వంటి పానీయాల పన్ను రాబడులను దెబ్బతీసింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే, ప్రస్తుత ట్రెండ్‌ను రివర్స్‌ చేయాలని జాతీయ పన్ను ఏజెన్సీసంకల్పించింది. ఆల్కహాల్‌ ఆదాయం గణనీయంగా పడిపోవడం జపాన్‌ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌ను ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు, కొన్నిరకాల ఉద్యోగాలకు యువ సిబ్బంది సరఫరా, భవిష్యత్‌లో వృద్ధుల సంరక్షణ గురించి కూడా ఆందోళనలు ఉన్నాయి. ఆదాయంతోపాటు పౌరుల ఆరోగ్యంపైనా జపాన్‌ ప్రభుత్వం జాగ్రత్తలు పాటిస్తోంది. తగిన మొత్తంలో మాత్రమే ఆల్కహాల్‌ సేవించాలని సూచిస్తోంది.

మీరే ఐడియా చెప్పండి..

మద్యపానాన్ని మరింత ఆకర్షణనీయంగా మార్చడానికి, పరిశ్రమను పెంచడానికి ఒక ప్రణాళికతో ముందుకు రావాలని పౌరులకు ట్యాక్స్‌ఏజెన్సీ పిలుపునిచ్చింది. ఇందుకోసం సేక్‌ వివా అనే నినాదంతో ఓ పోటీని ప్రారంభించింది. స్కాచ్‌, విస్కీ, బీర్‌, వైన్‌ విక్రయాలు పెరిగేలా ఓ ఐడియా ఇవ్వండంటూ విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమానికి 20-39 ఏళ్ల మధ్య వయసు యువతను లక్ష్యం చేసుకుంది. కొత్త ఉత్పత్తులు, డిజైన్‌లు, బ్రాండింగ్‌, కృత్రిమ మేథస్సుతో కూడిన అత్యాధునిక ప్రణాళికలతో ముందుకు రావాలని పోటీదారులను కోరింది. మెటావర్స్‌ ద్వారా విక్రయ పద్ధలు అన్వేషించడానికి సలహాలను కోరింది. ఈ పోటీ సెప్టెంబర్‌ చివర వరకు ఉంటుంది. ప్రతిస్పందనలపై నిపుణులతో చర్చించి, వారి సహాయంతో నవంబర్‌ 10న టోక్యో కార్యక్రమంలో తుది ఫలితాలు వెల్లడిస్తారు.

30 ఏళ్లలో 65 శాతం డౌన్‌..

ఏటికేడాది మద్యం విక్రయాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితి దేశీయ ఆల్కహాల్‌ మార్కెట్‌ను కృంగదీస్తున్నది. 2021 ట్యాక్స్‌ ఏజెన్సీ రిపోర్టు ప్రకారం కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వానికి మద్యమే ప్రధాన ఆదాయవనరు. గతేడాది 800 కోట్ల డాలర్ల ఆదాయమే సమకూరింది. ప్రభుత్వ మొత్తం రాబడిలో ఇది కేవలం 1.7 శాతమే. 2011లో ఇది 3 శాతంగాను, 1980లో 5 శాతంగాను ఉండేది. కరోనా కాలంలో బార్లు రెస్టారెంట్లు మూతబడటం మద్యం విక్రయాలను బాగా దెబ్బతీసింది. ఆ తర్వాత ఆంక్షలు ఎత్తివేసినా మునుపటి స్థాయికి విక్రయాలు చేరుకోలేదు. ఇది ప్రభుత్వానికి మద్యం ఆదాయంపై ప్రభావం చూపింది.

- Advertisement -

జనరేషన్‌ గ్యాప్‌..

ప్రపంచ బ్యాంగ్‌ గణాంకాల ప్రకారం జపాన్‌ జనాభాలో దాదాపు మూడవ వంతు (29శాతం) మంది 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసువారే. ఈ నిష్పత్తి ప్రపంచంలోనే అత్యధికం. మరోవైపు జననాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ రెండు అంశాలు మద్యం విక్రయాలు తగ్గడంలో పెను ప్రభావం చూపుతున్నాయి. కొత్తతరం యువత వారి పూర్వీకుల కంటే తక్కువగా ఆల్కహాల్‌ సేవిస్తుండం మరొక కారణం. 40-60 ఏళ్ల మధ్య వయస్కుల్లో 30 శాతం మంది రెగ్యులర్‌గా ఆల్కహాల్‌ తీసుకుంటున్నారు. 20 ఏళ్ల యువతలో 7.8 శాతం మాత్రమే రెగ్యులర్‌గా మద్యం సేవిస్తున్నారు. 1995లో కంటే 2020లో మద్యపానం చాలా తక్కువగా ఉంది. ఒక వ్యక్తి వార్షిక సగటు వినియోగం 100 లీటర్ల నుంచి 75 లీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. బీర్‌ విక్రయాల పరిమాణం 20 శాతం క్షీణించి 1.8 బిలియన్‌ లీటర్ల కంటే తక్కువగా ఉంది. 2020లో తలసరి బీర్‌ వినియోగం 55 బాటిళ్లకు తగ్గింది. 2019తో పోల్చితే ఇది 9.1 శాతం క్షీణత.

Advertisement

తాజా వార్తలు

Advertisement