న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రుణాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నల్గొండ ఎంపీ (కాంగ్రెస్) ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో గణాంకాలతో సహా పూర్తి వివరాలు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్రం మొత్తం రుణభారం రూ. 75,577 కోట్లుగా ఉండగా 2022 నాటికి అవి రూ. 2,83,452 కోట్లకు చేరుకున్నాయని వివరించారు.
ప్రభుత్వం చేస్తున్న రుణాలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల నుంచి కూడా అదనంగా వేల కోట్ల మేర తెలంగాణ రాష్ర్ట కార్పొరేషన్లు, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థలు రుణాలు చేస్తున్నాయని తెలిపారు. నాబార్డ్ నుండి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద నాబార్డ్ నుండి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.7,144 కోట్ల రుణాలు తీసుకుందని, వేర్‌హౌజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.85,227.94 కోట్లు తెలంగాణ ప్రభుత్వం, కార్పొరేషన్లు తీసుకున్నాయని వివరించారు.
అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ కింద సుమారు రూ.1,007.10 కోట్లు తెలంగాణా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ తీసుకుందని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద నాబార్డ్ నుంచి తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్లకు రూ.11,424.66 కోట్లు తీసుకుందని తెలిపారు.