హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశంలోనే జీఎస్డీపి వాటాలో తెలంగాణ రెండో స్థానం సాధించింది. 8శాతం సొంత పన్నుల ఆదాయం వాటాతో తెలంగాణ రాష్ట్రం కేంద్ర ఆర్ధిక ఎదుగుదలలో కీలక పాత్ర పోసిస్తోంది. యూపీ రాష్ట్రం 10.3శాతం వాటాతో తొలిస్థానంలో ఉండగా, జార్ఖండ్, కేరళ, హర్యానాలు తర్వాతి స్థానాల్లో నిల్చాయి. దేశంలో సగటు సొంత వనరుల ఆదాయ నిష్పత్తి వాటా కేవలం 6శాతమేకాగా, తెలంగాణ 8శాతంపైగా నమోదు చేసుకొని జీఎస్డీపీలో తన వాటా ఆధిపత్యం కొనసాగిస్తోంది. సొంత పన్నుల ఆదాయ నిష్పత్తి వాటా ఎక్కువగా ఉన్న నేపత్యంలతో ఆర్ధిక కార్యకలాపాల ద్వారా తెలంగాణ రాష్ట్రం పన్నుల వసూలులో మెరుగైన సామర్ధ్యం కల్గి ఉన్నట్లుగా స్పష్టమవుతున్నది.
2022-23లో రాష్ట్రాలకు కీలక సొంత వనరుల రాబడి వనరుల్లో ఎస్‌జీఎస్టీ 23శాతం, అమ్మకం పన్ను 23శాతం, ఎక్సైజ్ సుంకాలు 14శాతం, సంటాపు డ్యూటీలు 11శాతం, వాహన పన్నులు 5శాతం, ఎలక్ట్రిసిటీ పన్నులు, సుంకాల వాటా 3శాతంగా ఉంది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడి గతేడాది ఇదే సమయంకంటే 16శాతం వృద్ధిరేటును సాకారం చేసుకుంది. ఈ ఏడాది నవంబర్‌లో రూ. 5979కోట్ల రాబడి రాగా, గతేడాది ఇదే సమయానికి రూ. 5143కోట్లు మాత్రమే వచ్చింది. ఇప్పటివరకు ఎనిమిది నెలల్లో రూ.46,641కోట్లు సమకూరింది. అమ్మకం పన్ను రూ. 33వేలకోట్ల అంచనాల్లో రూ.20,038కోట్లు ఖజానాకు చేరింది.
కేంద్రంనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత, ఆర్థికమాంద్యం ప్రభావంతో సొంత వనరుల ద్వారా ఆదాయం బాగా తగ్గిన నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని, ఈ పరిస్థితుల్లో ఉన్న నిధులను సర్దుబాటు చేసుకోక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకుని స్వీయ నియంత్రణ పాటించాలని ప్రయత్నిస్తోంది. నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర ఆర్థికస్థితి, ఆర్థిక నియంత్రణ, ప్రాజెక్టులకు నాబార్డు రుణాలు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రుణ సేకరణ, ఆదాయం పెంచుకునే మార్గాలు, తప్పనిసరి వ్యయాలు, కోతలు పెట్టాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. పెండింగ్ పథకాలు, వాటికి నిధులు, సత్వరమే చేపట్టాల్సినవి తదితర అంశాలపై సమగ్ర నివేదికను మంత్రులకు అందజేయనున్నట్లు తెలిసింది.
కేంద్రంనుంచి రాబడులు, గ్రాంట్లు, సీఎస్‌స్, కేంద్ర ఆర్ధిక సాయాల్లో కోతలపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆదాయం తగ్గిన నేపథ్యంలో స్వీయ నియంత్రణ, ఖర్చుల్లో కోతలు, శాఖల వారీగా తగ్గింపులు చేయాలని భావిస్తోంది. రానున్న నాలుగు నెలల్లో భూముల అమ్మకాల రూపంలో రూ. 10 వేల కోట్ల మేర సమీకరణకు కీలక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర కోతలు, రుణాలపై ఆంక్షల నేపథ్యం, మరోవైపు వ్యయాలు పెరిగిపోతుండటంతో నానాటికీ రెవెన్యూ లోటులోకి వెళుతోంది. మితిమీరిన ఖర్చులు, పెరుగుతున్న జీతభత్యాలు, ప్రాజెక్టులు, ప్రజాసంక్షేమ పథకాల వ్యయాలు భారీగా పెరగడంతో గడచిన ఎనిమిది మాసాల్లో రెవెన్యూ లోటుకు చేరువైనట్లు తెలుస్తోంది.
ప్రణాళికేతర వ్యయంలో కోత
తాజాగా ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని చూస్తోంది. రెవెన్యూ ఖర్చులతో ఉండే ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. ప్రణాళికేతర వ్యయాల్లో భారీగా ఉద్యోగులు వేతనాలు, ఫించన్లు, పీఆర్సీ పరిహారాలు వంటివి ఉన్నాయి. ప్రతీనెలా దాదాపు వివిధ మార్గాల్లో రూ. 10వేల కోట్ల రాబడి ఖజానాకు చేరుతుండగా ఖర్చు రూ. 12వేల కోట్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రూ. 2 వేల కోట్ల నిధులకు కష్టంగా ఉంటోంది. ఈ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేయడం ఆర్థికశాఖకు కష్టంగా మారింది.
వీటికే ప్రాధాన్యత….
రాష్ట్ర ప్రాధాన్యతా పథకాలకు నిధుల అవసరం ఎక్కువ అవసరమవుతున్నాయి. సంక్షేమ పథకాల కొనసాగింపు, వేతనాలు, ప్రాజెక్టుల నిర్మాణానికి భారీగా నిధుల అక్కర నెలకొంది. సబ్సిడీలు, దళితబంధు, కొత్తగా రూ. 3లక్షల సొంతింటికి సాయం, సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ, సబ్సిడీ ఎరువులు, విత్తనాల సరఫరా, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్‌రూం ఇండ్లతోపాటు పెరిగిన కొత్త ఉద్యోగాలు, పీఆర్సీ అమలు నేపథ్యంలో ఉద్యోగులు వేతనాలకు అధికంగా కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శాఖలవారీగా నిధుల్లో కోతలు, స్వీయ నియంత్రణలు అమలు చేయాలని ఆర్ధిక శాఖ ప్రయత్నిస్తోంది.