హైదరాబాద్, ఆంధ్రప్రభ: గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి రాబోతోంది. గోదావరి నదిపై మంచిర్యాల-అంతర్గామ్ల మధ్య రూ.164 కోట్ల వ్యయంతో హైలెవల్ బ్రిడ్జి (హెచ్ఎల్బి) నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టనుంది. రెండు అతిపెద్ద వ్యాపార, పారిశ్రామిక ప్రాంతాలైన మంచిర్యాల-రామగుండం పట్టణాల మధ్య రాకపోకలు సాగించడానికి వీలుగా దీన్ని నిర్మించనున్నారు. రూ.164 కోట్ల వ్యయంతో 1.4 కిలోమీటర్ల మేర బ్రిడ్జిని నిర్మిస్తారు. ఈ బ్రిడ్జి రెండు వరుసల రహదారిగా ఉండనుంది. గోదావరికి ఆనుకొని ఇరువైపులా ఉన్న ఈ రెండు పట్టణాలను కలుపడానికి రైలు మార్గం మినహా రోడ్డు మార్గం లేదు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే సుదూర ప్రాంతం నుంచి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ దూరాన్ని తగ్గించి రెండు కీలకమైన వాణిజ్య పట్టణాలకు రోడ్డు రవాణ సౌకర్యం కల్పించడంలో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆర్అండ్బీ ఇంజనీర్లు టెండర్లు పిలిచారు. జూలై 5వ తేదీ టెండర్లు దాఖలకు చివరి తేదీగా నిర్ణయించారు. అప్పటి వరకు సాంకేతిక అర్హత పొందిన సంస్థల నుంచి ఫైనాన్స్ బిడ్లు ఆహ్వానించి, ఓపెన్ చేసి ఏ సంస్థ ఎంతకు నిర్మాణం చేపడుతుందో పరిశీలించి అర్హత పొందిన వారిని ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేయబడిన సంస్థ నెలరోజుల్లోగా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి దాదాపు 24 నెలల్లో ఈ బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.