హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రవీందర్ గుప్తా ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఓ ప్రైవేట్ కాలేజీకి పరీక్ష హాలు కేటాయించేందుకు రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆయన్ను పట్టుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన శంకర్ బీమ్‌గల్‌లోని తన ప్రైవేట్ కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వీసీని సంప్రదించగా అనుమతులు ఇచ్చేందుకు వీసీ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో వీసీ డిమాండ్‌పై శంకర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వీసీ అడిగిన మొత్తాన్ని హైదరాబాద్ తర్నాకాలోని ఆయన ఇంట్లో ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ వర్సిటీలో వీసీ అనేక అక్రమ నియామకాలు, అవినీతికి పాల్పడినట్లు వర్సిటీ ఈసీ సభ్యులు ఏసీబీకి ఫిర్యాదు చేయగా ఈనెల 6, 13వ తేదీల్లో వర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పరీక్షా కేంద్రం కోసం వీసీ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ ట్రాప్‌కు చిక్కారు. ఫిర్యాదుదారుడు శనివారం ఉదయం వీసీని కలవడానికి ఇంటికి వెళ్లి లంచం డబ్బును అందజేయగా అధికారులు పట్టుకున్నారు. నివర్సిటీలో, వీసీ ఇళ్లు, ఆయన కార్లల్లో దాదాపు 8 గంటల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కోణంలో డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ తెలిపారు.
గతంలో జరిగిన విజిలెన్స్ దాడులపై వివరాలు సేకరిస్తున్నట్లు మీడియాకు ఆయన పేర్కొన్నారు. రవీందర్ గుప్తాను ఇంకా విచారించాల్సి ఉందన్నారు. సోదాలు ముగిసిన అనంతరం రవీందర్ గుప్తాను కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. అయితే రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌కు చిక్కడంతో ఆయన హయాంలో వర్సిటీలో జరిగిన గోల్‌మాల్ వ్యహారాలు ఏమైనా ఉంటే అవి వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీసీ రంవీందర్ గుప్తా ఏసీబీకి చిక్కడంతో వర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు.
నిత్యం వివాదమే…
తెలంగాణ వర్సిటీ నిత్యం ఏదోక వివాదంలో వార్తల్లోకి ఎక్కుతునే ఉంది. వీసీ రవీందర్ గుప్తా తీసుకున్న నిర్ణయాలతో ప్రతిసారి ఏదోక వివాదం వర్సిటీలో రాజుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే పాలకమండలి సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో వరుసగా ఈసీ ఈమధ్య కాలంలో సమావేశాలను నిర్వహించింది. ఇందులో క్రమంగా వీసీ అధికారులకు కత్తెర వేస్తూ తీర్మానాలు చేస్తూ వచ్చింది. మొదట రిజిస్ట్రార్‌ను తొలగించింది. ఆ తర్వాత ఆర్థిక అంశాలకు సంబంధించి వీసీని దూరం చేశారు.
ఈ క్రమంలోనే విజిలెన్స్, ఏసీబీ విచారణకు లేఖ రాయాలని ఈసీ తీర్మానం చేసింది. అదేవిధంగా వర్సిటీని చక్కదిద్దే బాధ్యతను ప్రభుత్వానికి అప్పగిస్తూ పాలకమండలి తీర్మానం చేసింది. ఇటీవల విజిలెన్స్ అధికారులు వర్సిటీలో తనిఖీలు చేపట్టారు. అన్నింటిపైనా పూర్తి నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ వలలో పట్టుబడ్డాడు.
కొన్ని రోజులుగా ఈసీ వర్సెస్ వీసీ…
వర్సిటీ రిజిస్ట్రార్ నియామకం, ఇతర సిబ్బంది నియామకాల విషయంలో గత కొన్ని నెలలుగా వర్సిటీ ఈసీ, వీసీ రంవీదర్ గుప్తా మధ్య వివాదం నడుస్తోంది. వీసీ రవీందర్ నియమించిన రిజిస్ట్రార్‌ను తొలగిస్తూ మరోకరిని నియమిస్తూ వర్సిటీ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆతర్వాత ఈసీ నియమించిన రిజిస్ట్రార్ నియామకం చెల్లదని వీసీ మరోకరిని నియమించడం…ఇలా గత కొన్ని నెలలుగా వర్సిటీలో రచ్చ జరిగింది. వీసీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తప్పుబట్టారు. ఇదే క్రమంలో నవీన్ మిట్టల్‌పై వీసీ రవీందర్ గుప్తా ఆరోపణలు కూడా చేశారు. యూనివర్సిటీపై ప్రభుత్వ అధికారుల పెత్తనమేంటనీ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ వర్సిటీ వ్యవహారంలో నవీన్ మిట్టల్ తలదూర్చుతున్నారని వీసీ రవీందర్ గుప్తా మొదటి నుంచి ఆరోపిస్తున్నారు.
కమిషనర్ బాధ్యతల నుంచి నవీన్ మిట్టల్ తొలగింపు…
వీసీ రవీందర్ గుప్తా రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొద్ది గంటల్లోనే ఉన్నత విద్యాశాఖ కమిషనర్ బాధ్యతల నుంచి నవీన్ మిట్టల్‌ను ప్రభుత్వం తప్పించడం గమనార్హం. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయింది.
నో కామెంట్: వీసీ రవీందర్ గుప్తా
ఈ కేసు విషయంలో వీసీ రవీందర్ గుప్తాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన నో కామెంట్ అని బదులిచ్చారు. మిమ్మల్ని కావాలని ట్రాప్ చేసి ఇరికించే ప్రయత్నమేమైనా చేశారా? అని ప్రశ్నించగా నో కామెంట్ అని సమాధానమిచ్చారు. మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన ఇదేవిధమైన సమాధానం ఇచ్చారు.
వర్సిటీకి కొత్త వీసీ…
ప్రస్తుత వీసీ రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో ఆయనపై వేటు పడే అవకాశం ఉంది. దీంతో ఇక కొత్త వీసీ రానున్నారు. ఇంఛార్జ్ వీసీని నియమించేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. కాకతీయ వర్సిటీ రాజనీతి విభాగంలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన ఓ ప్రొఫెసర్ ఇంచార్జ్ వీసీగా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరికొంత మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో కొత్త వీసీ వచ్చే అవకాశముంది.