హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహిళల భద్రత, రక్షణకు తీసుకుంటున్న చర్యలు, చట్టాలను కఠినంగా అమలు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళ భద్రత, సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా అదనపు డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా ”ఉమెన్ సేప్టీ వింగ్”ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాడులు, అకృత్యాలు జరిగితే రక్షించే ప్రత్యేక వ్యవస్థ ఒకటి ఉందన్న ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా భద్రతా విభాగం కింద… షీ టీమ్స్, భరోసా, షీ సైబర్ ల్యాబ్ ఉపవిభాగాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు చెందిన అధికారులు తెలంగాణలో మానవ అక్రమ రవాణా నివారణతో పాటు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు.
భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి… తాము ఎదురుకుంటున్న పలు సమస్యలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించింది. మహిళా భద్రతా విభాగానికి 2021 సంవత్సరంలో మొత్తం 5145 ఫిర్యాదులు అందగా అవన్నీ పరిష్కారమయ్యాయి. సమాజంలో ఎదురుకుంటున్న పలు సమస్యలపై మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారికి భరోసా కల్పించేందుకు రాష్ట్రంలో 6 మహిళా భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్, వికారాబాద్, వరంగల్ , సంగారెడ్డి, నల్గొండ , సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ఈ భరోసా కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి. వీటితోపాటు కొత్తగా మేడ్చల్ , మాల్కాజ్ గిరి, మెదక్ , ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనూ ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా హైదరాబాద్ పాత బస్తీ, సైబరాబాద్ , రాచకొండ పోలీస్ కమీషనరేట్ల పరిదిలో కూడా భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
మానవ అక్రమ రవాణా నియంత్రణలో టాప్‌లో తెలంగాణ..
మానవ అక్రమ రవాణా రాష్ట్రాలకు అతి పెద్ద సమస్యగా పరిణమించిన తరుణంలో ఈ సమస్యను తెలంగాణ పోలీసులు సమర్థంగా ఎదుర్కొంటున్నారు. మానవ అక్రమ రవాణా నిరోదక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. అక్రమ రవాణకు గురవుతున్న వారిని గుర్తించి రక్షించడంతో పాటు వారికి వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఇతర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ జిల్లాల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేయడంతోపాటు అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. అంతర్ రాష్ట్ర మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. అక్రమ రవాణా సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ లైన్ 100, మహిళా హెల్ప్ లైన్ 181, 1098 చైల్డ్ లైన్‌కు నంబర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.
చిన్నారులు, మహిళల భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థలు..
పిల్లలు, మహిళలపై జరిగే అకృత్యాలు, సైబర్ నేరాలతోపాటు ఆన్‌లైన్ ట్రాఫికింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్, షీ సైబర్ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. అక్రమ రవాణాకు గురైన మహిళల కోసం రాష్ట్రంలో నాలుగు అబ్జర్వేషన్ హోమ్స్, మరో రెండు ప్రత్యేక హోమ్‌లు నడుస్తున్నాయి. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రంలో అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో స్వరక్ష దినాన్ని నిర్వహిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.