అమెరికాలో ఇద్దరు తెలంగాణకు చెందిన విద్యార్థులు సరస్సులో సరదాగా ఈతకు వెళ్లి మునిగి పోయారు. ఈ విషయాన్ని అక్కడి పోలీస్ అధికారులు ట్విట్టర్‌లో ఫోటోలను షేర్ చేశారు. శనివారం వీకెండ్ కావడంతో సరదాగా మిస్సోరిలోని ఒజర్క్స్ సరస్సుకు వెళ్ళారు. ముందుగా 24 సంవత్సరాల ఉత్తేజ్ సరస్సులోకి వెళ్లి ఈతకొట్టాడు. అయితే తన స్నేహితుడు మునకకు గురవుతున్నాడని పసిగట్టిన శివ వెంటనే సరస్సులోకి దిగి కాపాడే ప్రయత్నం చేశాడు. దురదృష్టవశాత్తు శివకూడా మునకకు గురయ్యాడు. కాపాడండి అంటూ కేకలు వినిపించడంతో అక్కడే ఉన్న కొందరు పోలీసులకు కాల్ చేశారు. 2.20 గంటలకు మిస్సోరి స్టేట్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఉత్తేజ్‌ను సరస్సులోనుంచి బయటకు తీశారు. శివ కోసం వెంటనే గాలించగా లభ్యం కాలేదు.
ఆదివారం శివను రెస్క్యూ చేసిన పోలీసులు బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు సరస్సులో మునిగి చనిపోయినట్లు నిర్ధారించారు. వీరిని ఎవరైనా గుర్తుపట్టాలంటూ ట్విట్టర్‌లో ఫోటోలు షేర్ చేశారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు వచ్చినట్లు తేలింది. వెంటనే ట్విట్టర్ ద్వారా నంద్యాల కార్తీక్‌రెడ్డి తెలంగాణ కేటీఆర్‌కు ట్విట్ చేశాడు. ఎలాగైనా ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను తెలంగాణకు తరలించేలా చర్యలు తీసుకోవాలంటూ ట్విట్ చేశాడు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ బాధిత కుటుంబాలను కనుగొని.. వీలైనంత త్వరగా వారి మృతదేహాలను రప్పించేలా అక్కడి అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. విద్యార్థిని కాపాడేందుకు మరో విద్యార్థి కూడా నీటిలో మునిగి మృతిచెందినట్లు హోస్టన్‌లోని స్థానిక మీడియాలో ప్రసారమయింది. అక్కడే ఉన్న మేనేజర్ అర్నిబ్ ఇద్దరు విద్యార్థులు మునకకు గురవవడంతో ఎమర్జెన్సీ కాల్ చేసినట్లు తెలిపారు.