Wednesday, November 20, 2024

కృష్ణా జలాలపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం.. ఈ నెల 16న రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 34 టీఎంసీలకు మించి తరలించకుండా ఆంధ్రప్రదేశ్‌ను కట్టడి చేయాలని, ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచాల్సిందేనని, వెలిగొండ సొరంగం తవ్వకం ద్వారా వచ్చిన మట్టిని రిజర్వాయర్‌ కుడిగట్టు వైపు ఏపీ గుత్తేదార్లు డంప్‌ చేయడాన్ని నియంత్రించాలని కృష్ణా రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)ను తెలంగాణ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో బోర్డు ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) మూడో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ వాదనలు వినేందుకు కేఆర్‌ఎంబీ ఈ నెల 16న మూడో ఆర్‌ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కేఆర్‌ఎంబీ మే నెలలో రెండు సార్లు రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశాలను నిర్వహించింది. మే 20న మొదటి సారి, 30న రెండోసారి ఆర్‌ఎంసీ భేటీ జరిగింది. అయితే వర్షాకాల సాగునీటి సన్నాహక ఏర్పాట్లలో ఉన్నందున రాలేమని తెలంగాణ కేఆర్‌ఎంబీకి స్పష్టం చేసింది.

అదే సమయంలో శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తరలించకుండా కట్టడి చేయాలని, కృష్ణా జలాల్లో నీటి పంపకాలను 50:50శాతం నిష్ఫత్తిలో పంచాల్సిందేనని, వెలిగొండ సొరంగం మట్టిని శ్రీశైలంలో కలుపొద్దని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఆర్‌ఎంసీ సమావేశ ఎజెండాలో రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదల (రూల్‌ కర్వ్‌), వరద జలాల మళ్లింపు, జల విద్యుదుత్పత్తి విధానాలు ఈ అంశాలే ప్రధాన ఏజెండాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 16న హైదరాబాద్‌లోని జలసౌధలో ఏర్పాటు చేసిన ఆర్‌ఎంసీ మూడో సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు హాజరవుతారా..? లేదా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మే నెలలో జరిగిన రెండు ఆర్‌ఎంసీ సమావేశాలకు తెలంగాణ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మూడో ఆర్‌ఎంసీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిపై విధి విధానాలు, నీటి నిల్వ, నీటి విడుదల ప్రక్రియ, వరద జలాల మళ్లింపుపై తెలంగాణ అభిప్రాయాలను కృష్ణా బోర్డు విననుంది. మూడో దఫా సమావేశానికి కూడా తెలంగాణ గైర్హాజరైతే కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు బచావత్‌ ట్రిబ్యునల్‌, సీడబ్ల్యూసీ రూల్‌ కర్వ్‌ ముసాయిదా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో తాగు, సాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ వాదిస్తుండగా… శ్రీశైలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ అని, పూర్తిగా విద్యుదుత్పత్తి కోసమే ఆ ప్రాజెక్టును నిర్మించారని తెలంగాణ వాదిస్తోంది. విద్యుదుత్పత్తికి అనువైన పరిస్థితులు ఉంటే శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేస్తామని స్పష్టం చేస్తోంది. ఇక సాగర్‌ నుంచి సాగుకు నీరు విడుదల చేసినప్పుడే విద్యుదుత్పత్తి చేయాలన్న ఏపీ వాదనను తెలంగాణ వ్యతిరేకిస్తోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులు కాకుండా… కృష్ణా జలాల్లో 50:50 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ వాదిస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడినందున మరోసారి నీటి కేటాయింపులను పున: సమీక్షించాలని, ఆ క్రమంలో అంతరాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం-1956లోని సెక్షన్‌ 3 మేరకు కొత్త ట్రిబ్యునల్‌ వేయడం, లేదా ఉన్న ట్రిబ్యునల్‌కు నీటి కేటాయింపులను పున: సమీక్షించి కొత్త కేటాయింపులు జరిపే విధంగా ఆదేశించాలని తెలంగాణ స్పష్టం చేస్తోంది. ఇదే అంశంపై ఏపీ, తెలంగాణ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ మంగళవారం లేఖ రాశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 16న జరిగే ఆర్‌ఎంసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement