Saturday, November 23, 2024

TG | శాసనసభ సమావేశాల్లో ‘స్కిల్ యూనివర్సిటీ’ బిల్లు..

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన “తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ”కి సంబంధించిన బిల్లును త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారు. ఈ యూనివర్శిటీ ముసాయిదాను ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.

ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పుతున్న ఈ వర్సిటీ లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తితో పనిచేసేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్సిటీలో డిగ్రీ, డిప్లమాలతో పాటు సర్టిఫికెట్ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు.

మొత్తం ఇందులో 17 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫార్మా, నిర్మాణం, బ్యాకింగ్‌, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ-కామర్స్‌,యానిమేషన్, రిటైల్‌, గేమింగ్‌ కామిక్స్‌ రంగాల కోర్సులను మొదట ప్రవేశపెట్టనున్నారు. ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరుపొందిన కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ఆయా కంపెనీలతో ఎంఓయూ చేసుకోనుంది.

ఇక మొద‌టి ఏడాది 2వేల మందితో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20వేల మందికి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్న‌ట్టు తెలిపారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన నిధుల విషయంలో రాజీపడొద్దన్నారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ స్టాఫ్ కాలేజీ క్యాంపస్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చర్చించారు.

ఈఎస్సీతో పాటు న్యాక్ క్యాంపస్ ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతి సదుపాయాలుండే వివిధ ప్రాంగణాలను గుర్తించాలని సూచించారు. భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లోని సదుపాయాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రొఫెసర్ కోదండరాం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement