Thursday, January 23, 2025

Telangana Rising – మూడు రోజుల్లో…రూ.1.32 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు..

హైద‌రాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తైంది. దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. మూడు రోజుల దావోస్ పర్యటనలో భాగంగా పలు దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. అలాగే పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చాయి. తెలంగాణాకు భారీగా పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రైజింగ్ బృందం సక్సెస్ అయింది. మొత్తం పది కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది.

దాదాపు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే పెట్టుబడులు మూడింతలు మించాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈరోజుతో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగియనుంది. ఈరోజు సాయంత్రం దావోస్ పర్యటన ముగించుకొని స్వరాష్ట్రానికి రేవంత్ రెడ్డి బృందం పయనంకానుంది. రేపు హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రైజింగ్ బృందం చేరుకోనుంది.

- Advertisement -

పది ప్రముఖ సంస్థలు ఇవే..

1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు. 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు. 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు. రూ. 45,500 కోట్ల పెట్టుబడులు, 7,000 ఉద్యోగాలు

2.అమెజాన్ వెబ్ సర్వీసెస్: ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలోభారీ పెట్టుబడులు. రూ. 60,000 కోట్లు.

3. కంట్రోల్ ఎస్ (CtrlS): తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటాసెంటర్ క్లస్టర్‌. 400 మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్. రూ. 10,000 కోట్లు, 3,600 మందికి ఉపాధి.

4. జేఎస్ డబ్ల్యూ సంస్థ: రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ – రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. రూ.800 కోట్ల పెట్టుబడులు, 200 ఉద్యోగాలు.

5. స్కైరూట్ ఏరో స్పేస్‌: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు. రూ.500 కోట్ల పెట్టుబడులు.

6. మేఘా ఇంజనీరింగ్ (MEIL) మూడు కీలక ఒప్పందాలు. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్. రూ.15000 కోట్ల పెట్టుబడులు, 5250 మందికి ఉపాధి.

7. హెచ్‌సీఎల్ టెక్ సెంటర్: హైటెక్ సిటీలో3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్‌. 5000 మందికి ఉపాధి.

8. విప్రో : హైదరాబాద్‌లో విప్రో కంపెనీ విస్తరణ. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్. 5,000 మందికి ఉద్యోగాలు.

9. ఇన్ఫోసిస్: హైదరాబాద్‌లో ఇన్పోసిస్ క్యాంపస్ విస్తరణ. పోచారంలో ఐటీ క్యాంపస్‌‌లో కొత్త సెంటర్. రూ. 750 కోట్ల పెట్టుబడులు, 17,000 ఉద్యోగాలు.

10. యూనిలివర్ కంపెనీ: కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్. రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్‌ ఏర్పాటు. దాదాపు వెయ్యి ఉద్యోగాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement