Saturday, November 30, 2024

Telangana Rising – రుణమాఫీ సంపూర్ణం! ఇక రైతులకు పండుగే

నేడు మరో 3 ల‌క్ష‌ల‌ మందికి రుణ‌మాఫీ
సాంకేతిక కారణాలతో మూడు నెళ్లు ఆలస్యం
రైతుల వివరాలను సేకరించిన సర్కారు
నాలుగో విడత రుణమాఫీకి అంతా రెడీ
నేడు ఫండ్స్​ రిలీజ్​ చేయనున్న సీఎం రేవంత్​
పాలమూరు వేదికగా పలు పథకాల ప్రకటనలు
డిసెంబర్​ 1 నుంచి ప్రజా పాలన విజయోత్సవాలు
తొమ్మిది రోజులపాటు పండుగలా ఉత్సవాలు
పెద్దపల్లిలో నాలుగో తేదీన భారీ బహిరంగ సభ
9వేల మందికి నియామకపత్రాలు అందజేయనున్న సీఎం
అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అధికార యంత్రాంగం

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​: నాలుగో విడత రుణమాఫీ నిధుల విడుదలకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. శ‌నివారం (నేడు) మహబూబ్ నగర్‌లో జ‌రిగే స‌భ‌లో ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే దీనికి కావాల్సిన ఫండ్‌ని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. సీఎం ప్రకటన వెలువడిన వెంటనే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ‘రైతు పండగ’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రైతులతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సభా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

ఇత‌ర కీల‌క ప్ర‌క‌ట‌న‌లు ఉండే చాన్స్‌..

ప్రధానంగా రైతు రుణమాఫీపై సీఎం రేవంత్​ ప్రకటన ఉండబోతోంది. ఇప్పటికే మూడు విడతలు పూర్తి కాగా.. నాలుగో విడతలో మరో 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ స్కీమ్ వర్తింపజేయనున్నారు. వీరంతా రుణమాఫీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే.. పలు సాంకేతిక కారణాల రీత్యా వీరికి రుణమాఫీ కాలేదు. కుటుంబ నిర్ధారణ ప్రక్రియ పూర్తి కావటంతో.. మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇటీవలే షాద్​నగర్​లో మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలమూరు రైతన్న సభలో రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. మరోవైపు 3లక్షల మందికి రుణమాఫీ చేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అందుకే వారికి రుణ‌మాఫీ ఆల‌స్యం..

రైతన్న సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా రైతులు తరలిరానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రుణమాఫీనే కాకుండా.. రైతుభరోసాపై కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ₹2 లక్షల పంట రుణాల మాఫీ పథకాన్ని పట్టాలెక్కించింది. ఇప్పటి వరకు 22,22,067 మంది రైతులకు ₹17,869.22 కోట్లను మాఫీ చేసింది. మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. అయితే.. కొన్ని సాంకేతిక కారణాలతో అధిక సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. వారి వివరాలను సేకరించింది. కుటుంబ నిర్ధారణ చేసేందుకు మూడు నెలలపాటు సమయం తీసుకుంది.

మ‌రో 9 వేల మందికి నియామ‌క ప‌త్రాలు..

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. కాగా, డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపనుంది. ఈ వేదికగా గ్రూప్‌‌-4తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి అందించ‌నున్నారు.

పండుగ‌లా విజ‌యోత్స‌వాలు..

డిసెంబర్ 1వ తేదీ నుంచి శాఖల వారీగా నిర్దేశించిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయి. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విజయోత్సవాల్లో భాగంగానే ఇవాళ పాలమూరులో రైతన్న సభను నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement