Tuesday, November 5, 2024

TG | వరి దిగుబడిలో తెలంగాణా రికార్డ్..

వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. అయితే, భారతదేశం మొత్తం మీద ఎన్నడూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రాలేదని స్పష్టం చేశారు.

మంగళవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు లోక్‌సభ, పాలక మండలి సభ్యులు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… దాన్యంకొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. 60.80 లక్షల ఎకరాలలో ప్రభుత్వం అంచనా వేస్తున్న దిగుబడిలో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. అందులో 47 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలుగా,44 లక్షలు దొడ్డు రకం ఉంటాయన్నారు.

ఖరీఫ్ నుండి సన్నాలకు బోనస్ గా క్వింటా ఒక్కింటికి రూ.500 ప్రకటించిన నేపద్యంలో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపరన్నారు. దిగుబడిలో సన్నాలు 47 లక్షల అంచనాయో ఇందుకు నిదర్శనమన్నారు. ఈ మొత్తం కొనుగోలుకు గాను 30 వేల కోట్లు అవుతుందన్నారు.

ప్రభుత్వం ఇప్పటికే 20 వేల కోట్లు విడుదల చేసిందని ఆయన తెలిపారు. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు అదనంగా నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నమన్నారు. ఈ నేపథ్యంలో దాన్యం కొనుగోలు విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

- Advertisement -

అదే సమయంలో రైతులు అయోమయంలో పడకుండా ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతాంగంలో అవగాహన కలిపించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. కొనుగోలులో ఎక్కడా రాజీ పడేది లేదని ముమ్మాటికీ ఇది రైతు పక్ష పాత ప్రభుత్వమని, రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు.

అత్యధికంగా రికార్డ్ స్థాయిలో పంట దిగుబడి ఆయిన నేపధ్యంలో ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వానికి పరీక్షా కాలం అని ఇందులో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం అవ్వాలని ఆయన కోరారు. ప్రజాప్రతినిధులు ఏమరు పాటుతో వ్యవహరించి ఎక్కడికక్కడ ధాన్యంకొనుగోళ్లు పకడ్బందీగా జరిగేలా చూడాలని ఆయన చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 7572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణా బియ్యానికి బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. రెండు, మూడు బయటి దేశాలు కుడా తెలంగాణా బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నాయన్నారు.

దాన్యంకొనుగోలు లో తాలు, తరుగుదల లేకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయని, తేమ శాతంలో రైతులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

ప్రకృతి విపత్తులతో అవాంతరాలు సంభవించిన పక్షంలో అధిగమించేందుకు అధికారులనూ సన్నద్ధం చేయాలని పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి.యస్ చౌహాన్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అటువంటి సందర్భంలో ఊపేక్షిస్తే సహించేది లేదన్నారు. దాన్యంకొనుగోలులో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తోడ్పాటనందించాలని ఆయన ఉద్బోధించారు.

రైస్ మిల్లుల పరిశ్రమ కు ప్రభుత్వం చేయుత నిస్తుందన్నారు. సీఎంఆర్‌ బియ్యం మిల్లింగ్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సన్నాలకు రూ.10 నుండి రూ.50, దొడ్డు రకానికి రూ.10 నుండి రూ.40 పెంచమన్నారు. నిబంధనల మేరకే బ్యాంక్ గ్యారెంటీ పెట్టమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాకుండా కేవలం 10 నెలల వ్యవది లోనే 11,537.40 కోట్ల ఋణాబారాన్ని తగ్గించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement