- హైదరాబాద్, ఆంధ్రప్రభ
భారత స్వాతంత్య్ర పారాటం అంటేనే గుర్తుకు వచ్చేది 1857లో జరిగిన సిపాయిల తిరుగు బాటు. ఆ పోరాటంలో అశువులు బాసిన గిరిజన వీరులకు స్వాతంత్య్ర సరయోధులుగా గుర్తింపు లభించలేదు. కనీసం నాటి ఆంగ్లేయులు చరిత్రపుటల్లోను ఈ సంఘటనలను నమోదు చేయలేదు. నిజాం రాజుల పత్వాల్లో శోధిస్తేకానీ కనిపించని మరుగున పడిన చరిత్ర ఇది. మధ్య భారతంలోని మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, పూర్వ ఏపీ గిరిజన తెగల సమూహంలో గొండ్వానా రాజ్యం క్రీ.శ. 1240-1750 వరకు వర్థిల్లింది.
బ్రిటిష్ వర్తకులు దేశంలో అడుగుపెట్టకముందే గొండ్వానా రాజ్యపాలన సాగింది. అయితే అయితే గొండురాజుల్లో చివరి రాజు నీల్ కంఠషా పాలనలో గొండ్వానను మహారాష్ట్ర పాలకులు ఆక్రమించుకుని బ్రిటీష్ పాలకులకు అప్పగించడంతో ఆదివాసి, గిరిజనుల్లో స్వాతంత్య్ర కాంక్ష రగిలింది. నిజాం రాజు సహకారంతో ఆంగ్లేయులు గొండ్వానాపై దాడులు ప్రారంభించారు. గొండు యోధుడు మార్సి కోల్ల రాంజీ గోండ్ నాయకత్వంలో ఆదివాసీలు ఆయుధమెత్తి సాధులయ్యారు. బ్రిటీష్ -నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సంగ్రామజ్వాలలు రగిలించారు.
సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ విశాలమైన నిర్మల్ కోట మైదానం పోరాటాలకు వేదికైంది. ప్రాణహిత నదీ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు పోరాట యోధులకు ఆశ్రయాలయ్యాయి. అయితే పరిస్థితి చేయిదాటి పోతుందని నాటి నిర్మల్ కలెక్టర్ బ్రిటీష్ రెసిడెన్సీకి, నిజాంరాజుకు సమాచారం అందించగా అప్పటికే అనేక పోరాటాలను అణచివేసిన కర్నల్ రాబర్ట్ కు గోండు పోరాటాలను అణచి వేసే బాధ్యతలను అప్పగించారు. కరడుగట్టిన బ్రిటీష్ సేనలు నాటి ఆధునిక ఆయుధాలతో సోన్ నదీ పరివాహక ప్రాంతంలో దాడులు చేసి వందలాది మంది గిజనులను అదుపులోకి తీసుకున్నారు.
గిజన గ్రామాలపై పాశవిక దాడులు చేసి తండాలను తగులబెట్టారు. ఫిరంగుల కు గిరిజనులను కట్టి పేల్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, సిర్పూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లోని గిరిజన తండాల్లో అగ్నికీలకలు ఎగిసిపడ్డాయి. ఏవైపు చూసినా ఆంగ్లేయుల ఆకృత్యాలు. అయితే ఈ పోరాటాలు, దాడులు పట్టణ ప్రాంతాలకు వ్యాపించకపోవడంతో ప్రాచూర్యంలోకి రాలేక పోయినప్పటికీ విదేశీ పత్రికల్లో కీలకంగా ప్రచురించినట్లు చరిత్రకారులు చెపుతారు.
ఓకే చెట్టుకు వేయిమంది ఉరి..
స్వేచ్ఛ లక్ష్యంగా, భూమికోసం, విముక్తి కోసం ఆయుధమెత్తి సాధులైన ఆదివాసి గిరిజనులను బ్రిటీష్ సేనలు నిరాయుధులను చేసి నిర్మల్ కోట ముందున్న మైదానానికి తరలించారు. క్రీ.శ. 1860 మార్చి 9న ( కొంతమంది చరిత్రకారులు ఏఫ్రిల్ 9 అని వాదిస్తుంటారు) నాయకుడు మార్సికోల్ల రాంజీ గోండ్ ను మర్రి చెట్టుకు ఉరితీశారు. అనంతరం వేయి మంది ఆదివాసీల కాళ్లు, చేతులను తాళ్లతో కట్టి వేసి అదే మర్రి చెట్టకు ఉరివేశారు. మిగిలిన వారికి ఔరంగాబాద్, పర్బిని, ఆదిలాబాద్ జైల్లలో జీవిత ఖైదు విధించారు.
అయితే.. జలియన్ వాలాబాగ్ ఉదంతం 1919లో జనరల్ డయ్యర్ జరిపిన 1650రౌండ్ల కాల్పుల్లో అధికారికంగా 379మంది మరణించగా సుమారు వేయి మంది క్షతగాత్రులయ్యారనే చరిత్రకు ముందే 1860లో ఓకే చెట్టుకు వేయి మంది స్వాతంత్య్రం కోసం విల్లంబులు పట్టిన ఆదివాసి గిరిజనులను ఉరితీసిన ఘటన జరిగిందనేది ఆలస్యంగా వేలుగు చూసింది. నాటి బ్రిటీష్ పాలకుల హింసకు పరాకాష్టగా నిలిచిన మర్రి 1995 వరకు నిర్మల్ కోట ముందు వారి ప్రాణ త్యాగాలకు నిదర్శనంగా నిలిచి ఉండేది.
1995లో ఈ చెట్టు నేలకు ఒరిగినా.. దాని ఆనవాళ్లు నేటికి ఉరులమర్రి పేరుతో మిగిలే ఉన్నాయి. అయితే స్వాతంత్య్ర సంగ్రామజ్వాలలు ఉత్తర భారతంలో రగిలినప్పటికీ అవి అక్కడికే పరిమితం కాలేదు. బానిస బంధనాలనుంచి మాతృభూమి విముక్తి కోసం ఆయుధమెత్తిన వీరులు అనేకం నేలకొరిగారు. అపారమైన బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొవడం ఆత్మహత్యసదృశ్యం ఆదివాసీలకు తెలుసు…పోరుబాటలో మరణం తథ్యమని తెలుసు అయినా పరాయి పాలనను తరిమికొట్టేందుకు కదనరంగంలో దూకి ఉరుకొయ్యలను ముద్దాడిన వారిత్యాగాలకు గుర్తింపు ఎప్పుడో..