Saturday, November 23, 2024

Big story | పాలమూరును అడ్డుకోవడం కాదు.. పట్టిసీమ లేక్కలు తేల్చాలంటున్న తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవాలని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు ఏపీ చేసిన ఫిర్యాదు పట్ల తెలంగాణ తీవ్రంగా స్పందిస్తోంది. తెలంగాణకు కృష్ణా నదీ నుంచి నిబంధనలమేరకు రావల్సిన నీటిని వినియోగించుకునేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఏపీ అడ్డకునే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ దుయ్యబడుతుంది. రాష్ట్ర పునర్‌ విభజన చట్టం లోని అంశాలను గౌరవిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను నిర్మిస్తుందని తెలంగాణ నీటి పారుదల శాఖ వివరిస్తోంది. పట్టిసీమ నుంచి ఆంధ్ర గోదావరి డెల్టాకు తరలించుకు పోతున్న కృష్ణా జలాల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఉందని అధికారులు చెప్పారు. కేఆర్‌ఎంబీ స్పందించి ఆనీటిని తక్షణం తెలంగాణ కు కేటాయించేందుకు చర్యలు చెపట్టాలనీ, కృష్ణా నీటి వాటాల్లో తెలంగాణ కు జరిగిన అన్యాయాలను పరిగణలోకి తీసుకుని కృష్ణా నీటివాటాల్లో ప్రస్తుత నీటి సంవత్సరానికి 50:50 రాబోయే సంవత్సరాలకు 70 శాతం నీటిని కేటాయించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్లను ఇప్పటికే కేఆర్‌ఎంబీ సీడబ్ల్యూసీ, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందుంచింది. ఒకవైపు న్యాయమైన వాటాలకోసం తెలంగాణ పోరాటాలు చేస్తుంటే మరోవైపు పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంచి కృష్ణా జలాలను తరలించుకు పోతున్న ఏపీ తెలంగాణ కు మరోసారి నీటి వాటాల్లో అన్యాయం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. పట్టిసీమ నీటి నుంచి 45 టీఎంసీల నీరు తెలంగాణ కు వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉంటాయని తెలంగాణ వాదిస్తోంది.

పట్టిసీమ కృష్ణా,గోదావరి నదీయాజమాన్యం బోర్డుపరిధిలోకి వస్తుందని తెలంగాణ చేస్తున్న వాదనలను పక్కకు పెట్టి 2017-2018లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా ముమ్మరంగా నీటిని తరలిస్తుంది. ఇది కళ్లముందు కనిపిస్తున్నా కేఆర్‌ఎంబీ చోద్యం చూస్తుంది. ప్రస్తుతం 45000 క్యూసేక్కుల డిశ్ఛార్జి తో పట్టిసీమ నుంచి గోదావరి డెల్డాకు నీరు అందిస్తున్నారు. ప్రతిసంవత్సరం 80 టీఎంసీలను డెల్టాకు తరలించి సుమారు 14 లక్షల ఎకరాలకు పైగా ఆంధ్ర నీరు అందిస్తున్నది. పట్టి సీమ నుంచి తరలిస్తున్న నీటి నుంచి వాటా ఇవ్వకుండా ఏపీ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంటే కేఆర్‌ఎంబీ ఎందుకు స్పందించడంలేదని తెలంగాణ వాదిస్తున్నది. వాస్తవంగా కీలకమైన కృష్ణా జలాల వాటాలపై ప్రతిఏటా 11లేదా12 జూన్‌ లో సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా ఆమేరకు నిర్వహించకుండా ఇష్టం వచ్చినప్పుడు సమావేశాల తేదీలను ప్రకటిస్తూ కృష్ణా బోర్డు కాలాపన చేస్తున్నదనే విమర్శలున్నాయి. అయితే గతంలో ఎ.కె.బజాజ్‌ కమిటీ ముందు తెలంగాణ బలంగా వాదనలు వినిపించింది. పట్టిసీమ, పోలవరం నుంచి తెలంగాణకు 78 టీఎంసీల నీటి వాటాకావాలని పట్టిబట్టింది. ఆంధ్ర చేస్తున్న జలచౌర్యాన్ని తెలంగాణ ఎండగట్టింది.

- Advertisement -

ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను గోదావరికి మళ్లిస్తున్న నేపథ్యంలో రెండురాష్ట్రాలమధ్య ఆనీటిని పంచాలని డిమాండ్‌ చేసింది. పట్టి సీమనుంచి 45 టీఎంసీ లు తెలంగాణ వాటాగా రావల్సి ఉందని గతంలోనే తెలంగాణ ఫవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేఆర్‌ఎంబీ కమిటీ ముందు వివరించింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడటంతో ఇప్పటివరకు 174 టీఎంసీలను కోల్పోయినట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ వివరించింది. గత ఉమ్మడి పాలనలో తెలంగాణలో రిజర్వాయర్లు లేకపోవడంతో నీటి నిల్వ సామర్ధం తక్కువగా ఉండేదనీ, దిగువరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఆనీటి ఉపయోగించుకునేదని తెలంగాణ వాదిస్తున్నది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టినా నికర జలాలు అందుబాటులో లేకుండాఏపీ నీటిని తోడుకుంటుందని తెలంగాణ భావిస్తోంది.

తెలంగాణ కరువుజిల్లాల నుంచి కృష్ణా ప్రవహిస్తున్నా కరువు జిల్లాలకు నీరు అందడంలేదని వాపోతున్నారు. పట్టిసీమనుంచి 45 టీఎంసీల నీటి వాటా తెలంగాణకు ఉందని ఇటీవల తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ లేఖ రాశారు. అయితే లేఖ అందుకున్న కేఆర్‌ఎంబీ ఇప్పటివరకు స్పందించక పోవడంతోనే పట్టిసీమనుంచి ప్రతిఏటా రావల్సిన 45 టీఎంసీల నీరు తెలంగాణకు రావడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా నీటిని తరలించుకు పోయిన ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అదే విధానాలు అవలింభిస్తుండం విచారకరమని తెలంగాణ వాపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement