ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ పేషేంట్స్ నే టార్గెట్ గా వాహన తనిఖీలు ముమ్మరం చేపట్టారు. కోవిడ్ పేషేంట్స్ తో వచ్చే అంబులెన్స్ లను వెనక్కి పంపిస్తున్నారు. ఆస్పత్రి అడ్మిట్ లెటర్ ఉన్నా… అనుమతికి నిరాకరిస్తున్నారు. పోలీసుల వైఖరిపై భాదితుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం చేయించుకునేందుకు వస్తుంటారు. చికిత్స చేయించుకుని కోలుకుని స్వరాష్ట్రాలకు వెళ్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ బోర్డర్‌లో ఇతర రాష్ట్రాల వాహనాలను అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలో విమర్శలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్స్ వాహనాలపై ఆంక్షలు విధించడం సరికాదంటున్నారు.