తెలంగాణ పోలీస్ అంటే దేశంలోనే బెస్ట్ అని రాష్ట్రం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ 281 మంది పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సేవా పతకాలను రవీంద్ర భారతిలో ప్రదానం చేశారు. కార్యక్రమంలో హోంమంత్రితో పాటు డీజీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. కొత్త పోలీస్ జోన్ల ఏర్పాటు, డివిజన్లు, స్టేషన్లు కొత్తగా ఏర్పాటుతోపాటు నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం, ఐ4సీలను సైతం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ టవర్‌ను సైతం ప్రారంభించుకున్నామన్నారు. రాష్ట్రంలో మెరుగైన శాంతియుత పరిస్థితులు ఉన్నందునే, అనేక బహుళ జాతి సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాయన్నారు. ఫ్రెండ్లి పోలీసింగ్, మహిళా భద్రతా విభాగం, షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సీసీ టీవీల ఏర్పాటు, మట్కా-గ్యాంబ్లిగ్ కేంద్రాల మూసివేత, మాదక ద్రవ్యాల నివారణ తదితర చర్యలతో తెలంగాణ పోలీస్ దేశంలోనే అత్యున్నత పోలీస్‌శాఖగా నిలిచిందని హోంమంత్రి తెలిపారు. శాంతిభద్రత పరిస్థితి మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు సక్రమంగా జరిగి రాష్ట్రం పురోభివృద్ధిలో పయనిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్‌శాఖ ఆధునీకరణ, పెద్ద ఎత్తున నియామకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఇటీవల ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ తరహా భవనం మరెక్కడా లేదని పేర్కొన్నారు.
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ పతకాలు కేవలం వ్యక్తిగతం కావని, తమ పరిధిలో పనిచే వారందరితోపాటు, కుటుంబ సభ్యులకు వచ్చినట్టుగా భావించాలన్నారు. పోలీస్‌శాఖ ఆర్థికాభివృద్ధిలో కీలకమైన ఓ ప్రధాన భాగమని అన్నారు. పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని, నిరంతరం ప్రజాసేవలో విధులు నిర్వర్తించే పోలీసులు తాము అందించే ఉత్తమ సేవలకు గుర్తింపుగా సేవా పతకాలను అంద చేయడం జరుగుతుందన్నారు. ఈ పతకాల స్ఫూర్తితో మరింత అంకితభావంతో పనిచేయాలని పోలీసు అధికారులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్‌శాఖకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీ అభిలాష బిస్త్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఏసీబీ డీజీ రవిగుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు విజయ కుమార్, షిఖా గోయల్, స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐజీలు కమలహాసన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, షా నవాజ్ ఖాసిం, రమేశ్‌తో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు.