పులిచింతల ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును ముక్త్యాల గ్రామ శివారులో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. పులిచింతల వద్ద తెలంగాణ సర్కారు అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ఉదయభాను ఆరోపించారు. ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన తమను అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. కృష్ణా డెల్టా రైతుల అవసరాల కోసమే పులిచింతల నిర్మాణం జరిగిందన్నారు. ఏపీ రైతుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం బచావత్ ట్రైబ్యునల్ చెప్పిన ప్రకారం నీటిని వాడుకోవాలని ఆయన తెలిపారు
వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా పులిచింతల నిర్మించారని, ఆయన తెలంగాణలోనే ఎక్కువ ప్రాజెక్టులు కట్టారన్నారు. అటువంటిది ఇప్పుడు తెలంగాణ మంత్రులు నేతలు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వైఎస్ఆర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా మెలగాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సూచించారని, అయితే, తాము దేవుడు చెప్పినా వినబోమంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన మండిపడ్డారు. కాగా ఏపీ భూభాగం నుంచి వెళ్లాలని ఎమ్మెల్యేకు పోలీసులు సూచించగా.. కృష్ణా నది మీదుగా గుంటూరు జిల్లా మాదిపాడు చేరుకుని, అక్కడ్నుంచి కారులో ఎమ్మెల్యే ఉదయభాను పులిచింతలకు వెళ్లారు.
ఇది కూడా చదవండి: ఏపీ జాబ్ క్యాలెండర్‌పై విద్యార్థుల ఆందోళనలు