ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : నేను ఎన్నో మంత్రిత్వ శాఖలో పనిచేసిన కూడా ఇక్కడున్న మార్పులు నేను ఎక్కడా చూడలేదు.. తెలంగాణలో ఉన్న అభివృద్ధి నేను ఇంత వరకు ఏ ప్రాంతంలో చూడలేదని, అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందుకు సాగుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
ఈరోజు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన వివిధ రంగాలలోని ప్రముఖులతో, జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆధ్యాత్మికంగా, సంస్కృతిపరంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు.
జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు చాలా ప్రభావవంతంగా ఉందని, అలాగే ఉపాధి హామీ పనులలో గ్రామాలలో ఎక్కువ పనులు కల్పించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వేగంగా అభివృద్ది చెందుతున్నదని అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్యాత్మికంగా, సంస్కృతిపరంగా ఎంతో ప్రసిద్ది చెందిందని, ఈ జిల్లాలో పద్మశ్రీ అవార్డులు పొందిన వారు ఎక్కువగా ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చేనేత సంస్కృతి చాలా గొప్పదని, చేనేత రంగంలో జిల్లా ప్రపంచ ప్రసిద్ది గాంచిందని, చేనేతను అందరూ ప్రోత్సహించాలని అన్నారు. ఈ జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని, తిరిగి మరొకసారి వస్తానని అన్నారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయ భాగస్వామ్యంతో పనిచేయడం అభినందనీయమని అన్నారు. వివిధరంగాలలో ప్రసిద్దులైన జిల్లాకు చెందిన అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు. కళాకారులు ఈ సందర్భంగా తాము కృషి చేసిన రంగాలలో సాధించిన ఫలితాలను గవర్నర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా స్వాతంత్ర్య సమరయోధులు మన్నె గోపాలరెడ్డి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లానాయక్ లను గవర్నర్ వారి వద్దకే వచ్చి శాలువాలతో సత్కరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.
సమావేశంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ జె.భవానీ శంకర్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఉన్నతాధికారులు ఉన్నారు. కార్యక్రమానంతరం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే.గంగాధర్ వందన సమర్పణ గావించారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కు ఘన స్వాగతం..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలం కొలనుపాక జైన,సోమేశ్వర దేవాలయం, భువనగిరి పట్టణ కేంద్రం లోని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు కె జెండగే, అదనపు కలెక్టర్ గంగాధర్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, స్వర్ణగిరి దేవాలయ చైర్మెన్ మానేపల్లి రామారావు, మురళి కృష్ణ, గోపి కృష్ణ లు పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువాతో ఘన స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
కొలనుపాక సోమేశ్వర స్వామి, స్వర్ణగిరి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని,అభిషేక పూజలో పాల్గొన్నారు.రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత దేవాలయం ముందు బతుకమ్మలు, బోనాలు, కోలాటలతో మహిళలు స్వాగతం పలికారు.
గవర్నర్ సమావేశంలో పాల్గొన్న అవార్డు గ్రహీతలు
యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన సమావేశంలో జిల్లా లోని కేంద్ర, రాష్ట్ర అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్దన్, గజం అంజయ్య, , చింతకింది మల్లేశం, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లా నాయక్, – సంత్ కబీర్ అవార్డు గ్రహీత జెల్లా వెంకటేశం, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్.గోపి, కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత డాక్టర్ గడ్డం మోహనరావు, రాష్ట్ర ప్రభుత్వ యువ పురస్కార గ్రహీత తిరునగరి శ్రీనివాస్- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ పురస్కార గ్రహీత శ్రీ రామోజు హరగోపాల్, పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి, స్వాతంత్య్ర్య సమరయోధులు మన్నె గోపాలరెడ్డి, నంది అవార్డు గ్రహీత ఎం.డి.అబ్దుల్, జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారగ్రహీతలు అభినయ శ్రీనివాస్, కడారి శ్రీనివాస్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు, శరత్ చంద్ర చటోపాధ్యాయ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ షేక్ అబ్దుల్ ఘని, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత దుద్యాల శంకర్, క కీర్తి పురస్కార గ్రహీత డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి లు పాల్గొన్నారు.