Friday, November 22, 2024

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ : స్పీకర్ పోచారం

నిజామాబాద్ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అని, మరే రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు లేవు అని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలోని కోటగిరి మండలం సుద్దులం తాండలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ… కుల , మతాలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయ‌న్నారు. నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అన్నదే నా లక్ష్యం అన్నారు. సీఎం దయతో బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో అత్యధికంగా 11,000 రెండు పడకల గదుల ఇళ్ళు మంజూరు అయ్యాయి అన్నారు. త్వరలోనే మూడు లక్షల రూపాయల పథకం వస్తుంద‌ని, అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేయిస్తామ‌న్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం పెడుతున్నారు, గర్భిణీలకు మరింత బలవర్ధకం కోసం నూతనంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నారు, డెలివరీ అయిన తరువాత కేసీఆర్ కిట్ ఇస్తున్నారుఅన్నారు. గిరిజన బాలికల కోసం ప్రత్యేకంగా బాన్సువాడ గ్రామీణ మండలం హన్మాజిపేట-కోనాపూర్ గ్రామాల మద్యలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తూ నిన్న GO జారీ అయింద‌న్నారు. క‌ళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంద‌న్నారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు పదివేల రూపాయలు ఆర్ధిక సహాయంగా ఇస్తున్నారు. మిషన్ భగీరధ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందుతుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement