ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్‌తో తెలంగాణలోకి మావోయిస్టులు
- ఇంటలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన పోలీస్‌శాఖ
- మావోల హెచ్చరికల నేపథ్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు భద్రతపెంపు
- పొలిటికల్ నేతల ఉలిక్కిపాటు
ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ బ్యూరో : రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీస్ వర్గాలు హై అలర్ట్ అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్ర బలగాలు భీకర దాడులు చేస్తుండటంతో మావోయిస్టులంతా సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశించినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. చత్తీస్‌గఢ్‌కు
సరిహద్దున ఉన్న చెన్నూరు, మంథని, భద్రాచలం, చర్ల, ములుగు దండకారణ్యం పై కేంద్ర రాష్ట్ర పోలీసులు నిఘా పెంచాయి.
వరుస ఎన్‌కౌంటర్లతో…
చత్తీస్‌గడ్ లో వరుస ఎన్ కౌంటర్లు తో పోలీసులు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బతీశాయి. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర బలగాలు మోహరించడంతో అక్కడి నక్సల్స్ తెలంగాణ సరిహద్దుల్లో ప్రవేశించినట్టు పోలీసుల కు సమాచారం అందింది. ఇందులో కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దీనిపై ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల ఎస్పీలు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నారు.
సరిహద్దుల్లో నిఘా పటిష్టం
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎస్పీల ఆధ్వర్యంలో శుక్రవారం నుండే పోలీస్ బలగాలు కూంబింగ్‌ను మొదలు పెట్టినట్టు సమాచారం. మాజీ నక్సల్స్, మావోయిస్టు సానుభూతిపరులపై కూడా పోలీసులు నిఘా పెట్టి కదలికలపై ఆరా తీస్తున్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు ఉన్న చెన్నూర్ జైపూర్ ,కోటపల్లి , అటు బెజ్జూర్, పెంచికల్పేట్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రణీత తీరంలో మావోల కదలికలపై నిఘా పెంచారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండల పరిధిలో గల బంధాల రిజర్వు అటవీ ప్రాంతంలోని వోడ్డుగూడెం గ్రామ సమీపంలో వెట్టేవాగు వద్ద ములుగు పోలీసులు భారీగా డంప్‌ను స్వాధీనం చేసుకోవడం అనుమానాలకు మరింత బలం చేకూరింది. పోలీసులకు చిక్కిన డంప్ లో 4 ఎస్‌ఎల్‌ఆర్‌లు, 165 రౌండ్ల బుల్లెట్లు, ఇతర ఆయుధాలు ఉన్నాయి.
ఎమ్మెల్యే వినోద్‌కు భద్రత పెంపు..
మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు పోలీసు భద్రత మరింత పెంచారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చి వెళ్లే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయాని, వారికి ఆయన వత్తాసు పలుకుతున్నట్టు మావోయిస్టు కోల్‌బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ పేరిట హెచ్చరిస్తూ లేఖ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే వినోద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి భూకబ్జాలు ఆగడాలకు తాను వ్యతిరేకమని ఈ విషయంలో ఎంతటి వారైనా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సేవలోనే తన జీవితం అంకితం చేశానని సమాధానం ఇచ్చారు.
ఏజెన్సీలో భయానక వాతావరణం
మావోయిస్టు ప్రభావిత సరిహద్దు ప్రాంతంలోని ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులకు, మంత్రులకు మరింత భద్రత పెంచారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో పొలిటికల్ నేతలు ఉలిక్కి పడుతుండగా, మరోవైపు కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు మొహరింపుతో భయానక వాతావరణం నెలకొంది. మహారాష్ట్రలో ప్రచారానికి వెళుతున్న తెలంగాణ మంత్రులు , ఎమ్మెల్యేలకు అక్కడ పోలీసులు భద్రత పెంచారు.