Tuesday, November 26, 2024

Delhi | స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం.. మందా జగన్నాథం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అహింసామార్గంలో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలకు మరో ప్రత్యేక ప్రతినిథి కే.ఎం. సాహ్నితో కలిసి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తొలుత గోదావరి బ్లాక్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం భవన్ ప్రాంగణంలోని శబరి బ్లాక్‌కు చేరుకుని పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఎగరేసి జెండా వందనం చేపట్టారు. వేడుకల సంధర్భంగా అమర వీరుల త్యాగాలను ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు స్మరించుకున్నారు .ఈ సందర్భంగా తేజస్వినీ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో దేశభక్తి గీతంతో కూడిన నృత్త రూపకాన్ని చిన్నారులు ప్రదర్శించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి హాజరయినవారందరికి మిఠాయిలు పంచారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. మంద జగన్నాధం ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం పొంది 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలనే సంకల్పంతో 2001 నుండి 2014 వరకు కే. చంద్రశేఖర రావు నేతృత్వంలో అహింసాయుత పోరాట ఫలితంగా 2014 జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. యావత్ ప్రజలను స్వాతంత్ర  పోరాట యోధులుగా స్మరిస్తూ వారి స్ఫూర్తితో ప్రగతి ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా సరే.. అతి తక్కువ సమయంలో రాష్ట్ర ప్రగతి పథంలో దూసుకెళ్లిందని కొనియాడారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అనేక పథకాలను ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం చేపట్టి అమలు చేస్తోందని అన్నారు. అనేక రంగాలలో జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన అవార్డులు సమర్ధవంతంగా సాగుతున్న పరిపాలనకు గీటురాళ్లు అని అభివర్ణించారు. పారిశ్రామిక రంగంలో  దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను తెలంగాణకు ఆహ్వానించి లక్షల మంది యువతకు ఉపాధి కల్పనలో సత్ఫలితాలను సాధించిందని చెప్పారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఉత్తరాదివాసులకు తెలియజేసేలా జాతీయ పండుగలతోపాటు తెలంగాణ పండుగలను పెద్ద ఎత్తున వేడుకగా జరుపుకోవాలని సూచించారు.

రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ఔన్నత్యాన్ని దేశ పౌరులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం  నూతనంగా ఏర్పడ్డప్పటికీ విన్నూత్నమైన పధకాలతో అభివృద్ది, సంక్షేమ రంగాలలో ఇతర రాష్ఠ్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వాతంత్ర్య పోరాటం ముగిసినా అదే పోరాట  స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశాభివృద్దికోసం పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement