Monday, November 18, 2024

కేసీఆర్ పేరు ఉచ్చరించే అర్హత రేవంత్‌కు లేదు: కేటీఆర్

సింగ‌రేణి బీఎంస్ అధ్య‌క్షుడు కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా కేటీఆర్ పలువురు నేతలపై మండిపడ్డారు. ఈ మధ్య మార్కెట్‌లో కొత్త బిచ్చగాళ్లు పుట్టారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిన్న, మొన్నా పుట్టినోళ్లు పదవులు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను గెలవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమించాలని హితవు పలికారు. కేసీఆర్‌తో తలపడాలంటే డైలాగ్స్ కొడితే చాలదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి ఏమైందో చూడాలన్నారు. నాగార్జునసాగర్‌లో ఓ యువకుడు జానారెడ్డిని ఓడించాడని గుర్తుచేశారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని కేటీఆర్ ఆరోపించారు.

అటు రేవంత్‌రెడ్డిపైనా మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. గతంలో సోనియాను తెలంగాణకు బలిదేవత అన్న రేవంత్.. ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడని ఆరోపించారు. కొన్నిరోజుల ఆగితే చంద్రబాబు తెలంగాణ తండ్రి అంటాడని ఎద్దేవా చేశారు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి నీతి మాటలు చెప్తున్నాడని, రేవంత్ పార్టీ మారడం గురించి మాట్లాడితే ప్రజలు కొడతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా రేవంత్‌కు లేదన్నారు. రేవంత్ తనకు ప్రధాని పదవి దొరికినట్లు బిల్డప్ కొడుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు. రాజస్థాన్‌లో బీఎస్పీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్లే.. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలోకి మారారని కేటీఆర్ అన్నారు. బజారు నాయకులు చిల్లర మల్లర మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఉన్నత పదవులు వచ్చినవారు ఉన్నతంగా పనిచేసుకుంటే మంచిదని కేటీఆర్ హితవు పలికారు.

ఇది కూడా చదవండి: పాదయాత్రలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యస్త్రాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement