రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పునరావాస ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో వరదలు వచ్చిన ఎలాంటి నష్టం కలగాకుండా చేపట్టాల్సిన అంశాలపై కేటీఆర్ అధికారులతో చర్చించారు.
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వర్షం నీరు ఎక్కడా నిలవకుండా ఉండేలా నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాబోయే వారం రోజుల్లోగా జిల్లాలో పంట నష్టానికి సంబంధించిన నివేదిక సమర్పించాలన్నారు. పట్టణంలో వరదల సమస్య మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీ, వ్యవసాయ, ఇతర సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.