హైదరాబాద్, ఆంధ్రప్రభ : చిరుధాన్యాల సంరక్షణకు జీవితాంతం కృషి చేయడమే గాక, సంఘం రేడియో పేర కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ప్రారంభించి నిరక్షరాస్యులైన మహిళలతోనే వ్యవసాయంపై రేడియోకార్యక్రమాలు నిర్వహించిన దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ సతీష్ (77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతతో ఉన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మరణించారు. సోమవారం ఉదయం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్‌లో అంత్యక్రియలు జరుగుతాయని డీడీఎస్ సంస్థ ప్రకటించింది. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిన పెరియపట్న వెంకటసుబ్బయ్య సతీష్ (పీవీ సతీష్ ) కర్నాటకకు చెందిన వారు. మైసూర్‌లో జన్మించారు.
ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, నూఢిల్లిdలో గ్రాడ్యుయేట్ అయిన పీవీ సతీష్ జర్నలిస్టుగా జీవితం ప్రారంభించారు. రెండేళ్ల పాటు దూరదర్శన్‌లో టెలివిజన్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఆ తర్వాత సామాజిక సేవారంగంలోకి అడుగుపెట్టారు. అది కూడా తన సొంత రాష్ట్రం కర్నాటకను కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నారు. 1980 లో కొందరు మిత్రులతో కలిసి దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని ఏర్పాటు చేసి జహీరాబాద్ కేంద్రంగా సేవా కార్యక్రమాలను 40 ఏళ్లక్రితం ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వందలాది గ్రామాల్లో ఆయన చిరుధాన్యాలపై రైతులను ముఖ్యంగా మహిళలను చైతన్యం చేశారు. పేదరికం, జీవవైవిధ్యం, ఆహార భద్రత, మహిళల సాధికారత, సామాజిక న్యాయంపై వేలాదిమంది మహిళల్లో చైతన్యం తీసుకువచ్చారు.
ఈ అంశాలపై ఆందోళనలు చేపట్టి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సామాజిక మాధ్యమాలు చదువుకున్న వారికే పరిమితం అనుకుంటున్న దశలో అక్షరాస్యత లేని దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలను ఎలక్ట్రానిక్ జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు. కమ్యూనిటీ రేడియోను స్థాపించి వ్యవసాయం,మహిళల సాధికారత, సామాజిక న్యాయం అంశాల్లో చైతన్య తీసుకువచ్చేందుకు కృషి చేశారు. తాను స్థాపించిన సంఘం రేడియోను కమ్యూనిటీ రేడియో స్టేషన్‌గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకువచ్చారు. తాను చేపట్టిన సేవా కార్యక్రమాలతో అంతర్జాతీయంగా రాష్ట్రానికి పేరు తీసుకువచ్చారు.
మిల్లెట్ మ్యాన్ సతీష్ కృషిని కొనసాగిద్దాం.. నిరంజన్ రెడ్డి
నలభై ఏళ్ల క్రితం దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని స్థాపించి పాత పంటలు, సంప్రదాయ పంటల సంరక్షణకు ఉద్యమమే చేపట్టిన తెలంగాణ మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ మృతికి వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పీవీ సతీష్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రతి సంక్రాంతికి పాత పంటల జాతర నిర్వహించి పాత పంటల పరిరక్షణకు 1980 నుంచి కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు. యునైటెడ్ నేషనల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో ఈక్వేటార్ అవార్డును గెలుచుకోవడం దేశానికే గర్వకారణమని నిరంజన్ రెడ్డి తెలియజేశారు.
మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణను కోల్పోయాం : హరీష్‌రావు
దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు పీవీ సతీష్ మృతిపట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి టి హరీష్‌రావు సంతాపం ప్రకటించారు. గొప్ప మానవతావాదిని కోల్పోయామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మిల్లెట్ మ్యాన్‌గా ఆయనకు గుర్తింపు ఉందని కితాబిచ్చారు. జహీరాబాద్ ప్రాంతంలో గడచిన నలభై సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తూ సేంద్రీయ పద్దతిలో చిరుధాన్యాలను పండించి గుర్తింపు తెచ్చారని హరీష్‌రావు కొనియాడారు.