హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. బుధవారం జనసేనానితో కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బీజేపీకి మద్దతు విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను బీజేపీ నేతలు పవన్ మద్దతును కోరారు.
జనసేన ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి దగ్గరైంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని పవన్ భావిస్తుండగా, బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేదు. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ దూరంగా ఉంటోన్న నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీకి పవన్ కల్యాణ్ మద్దతిచ్చే అంశంపై పార్టీలో చర్చిస్తానని చెప్పడం గమనార్హం. అలాగే రెండు మూడు రోజులలో మద్దతుపై నిర్ణయం ప్రకటిస్తామని జనసేనాని బిజెపి నేతలకు చెప్పినట్లు సమాచారం