హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొలువుల జాతర మొదలు కానుంది. గ్రూప్-1 కొలువుల భర్తీలో భాగంగా రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రూప్-1 పోస్టులకు మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల లింకులు అందుబాటులోకి రానున్నాయి. అయితే గ్రూప్-1కు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీఆర్‌లో సవరణ చేసుకోవాలి లేదా కొత్తగా ఓటీఆర్ నమోదు చేసుకోవల్సి ఉంటుంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్‌లో సవరణ చేసుకున్న వారే అర్హులవుతారు. మొత్తం 18 శాఖల్లోని 503 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియ అంతా సజావుగా సాగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం వరకు మొత్తం 2,12,784 మంది అభ్యర్థులు ఓటీఆర్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.
అయితే ఓటీఆర్, దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు తమ వివరాల్నీ సక్రమంగా నమోదు చేసుకుకోవాలి. దరఖాస్తు ప్రాసెస్ రుసుము రూ.200, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. పరీక్ష ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు టీఎస్‌పీఎస్సీ మినహాయింపు ఇచ్చింది. తాము నిరుద్యోగులమంటూ 18-44 ఏళ్లలోపు అభ్యర్థులు డిక్లరేషన్ సమర్పిస్తే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రిలిమినరీ పరీక్షకు ప్రతి అభ్యర్థి 12 జిల్లా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతోంది. ఒకసారి కేటాయించిన తర్వాత కేంద్రాలను మార్చే అవకాశం ఉండదు.
2.12 లక్షల దరఖాస్తులు…
503 పోస్టులతో ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీఆర్‌లో కచ్చితంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. కానీ దీనికి అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన రావడంలేదు. ఆదివారం వరకు కొత్తగా ఓటీఆర్ చేసుకున్న వారు 64,779 మంది కాగా, సవరణ చేసుకున్న అభ్యర్థులు 1,48,005 మంది. మొత్తం 2,12,784 మంది మాత్రమే ఓటీఆర్ చేసుకున్నవారు. విద్యార్హతలు ఇతర వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఇదిలా ఉంటే పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లోని 17,291 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కూడా నేటి నుంచి మే 20 వరకు టీఎస్‌ఎల్పీఆర్బీ అవకాశం కల్పించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..