హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశంలోనే పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ రాష్ట్రమని మంత్రి కేటీఆర్ అన్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను కేంద్రం కాఫీ కొట్టి అమలు చేసిందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన ఫుడ్ కాంక్లేవ్-2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మత్య్స సంపదలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని స్పష్టం చేశారు. పౌల్ట్రి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. దేశ విదేశాలకు చెందిన వ్యాపారులు ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తుందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్ పాలసీ పని తీరు బాగుందని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తే 15 రోజుల్లోనే కంపెనీ ఏర్పాటుకు అనుమతులు వస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు అద్భుతంగా పని చేస్తున్నాయని కొనియాడారు. దళిత బంధు పథకం కింద ఇస్తున్న రూ.10 లక్షలతో నలుగురు కలిసి 40 లక్షలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి, పత్తి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు.
డెయిరీ రంగం కొత్త పుంతలు -మంత్రి తలసాని..
తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డెయిరీ రంగంలో కొత్త పుంతలు తొక్కుతందని చెప్పారు. విజయ డైరీ కూడా లాభాల బాటలో సాగుతుందని తెలిపారు. విజయ డైరీలో అనేక కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. పౌల్ట్రిd, వ్యవసాయ రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
చేపల పెంపకంలో నూతన ఓరవడి -మంత్రి నిరంజన్ రెడ్డి..
వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి తొలి ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనే అని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చేపల పెంపకంలోనూ కొత్త పద్దతులను అవలంబిస్తున్నామన్నారు. మత్య్స రంగానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తుందని చెప్పారు.
ఫుడ్ ప్రాసెసింగ్‌లో రూ.7,218 కోట్ల పెట్టుబడులు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తొలి ఫుడ్ కాంక్లేవ్ సమావేశం విజయవంతం అయ్యింది. దాదాపు 7,218 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించింది. ప్రత్యక్షంగా 58,458 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, నూతన పద్దతులు, పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమలతో పాటు పలు అంశాలపై చర్చించారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం 7000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వెచ్చించిందని స్పష్టం చేశారు. ఈవెంట్‌లో ఐదు ట్రాక్‌లు ప్రధానంగా నిర్వహించబడ్డాయి. వ్యవసాయం, ఎడిబుల్ ఆయిల్, డైరీ, మాంసం మరియు పౌల్ట్రిd, ఆక్వాకల్చర్‌కు సంబంధించిన వాటిపై పెట్టుబడులు రాబట్టారు. ఈ సమావేశంలో నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ రమేష్ చంద్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.