హైదరాబాద్, ఆంధ్రప్రభ : సొంత వనరుల రాబడినుంచే అత్యధిక మొత్తంలో వ్యయాలు చేస్తున్న రాష్ట్రాలలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిల్చింది. ఏ రాష్ట్రం కూడా సాధించని పురోగతితో పన్నుల భారం మోపకుండా రాష్ట్ర సంపదను పెంచుతూ ముందుకు సాగుతోంది. 2019-20లో 69శాతం, 2020-21లో 72శాతం, 2021-22లో 73శాతం, 2022-23లో 74.6శాతం సొంత వనరుల రాబడినుంచే ప్రభుత్వం వ్యయాలు చేసి సొంత కాళ్లపై నిల్చింది. ఇక కేంద్రంనుంచి 2014-15లో పన్నుల వాటా రూ. 8189కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ల రూపంలో రూ. 6736కోట్లు, 2021-22లో కేంద్ర పన్నుల వాటా రూ. 13147కోట్లు, గ్రాంట్లు రూ. 8619కోట్లు మాత్రమే వచ్చాయి. 2022-23లో రూ.14వేల కోట్లే వచ్చి గతంకంటే ఈ రెండు భారీగా తగ్గుదల నమోదయ్యాయి.
గతేడాది అప్పుల్లో రూ. 19 వేల కోట్లు కోతలు విధించింది. ఈ ఏడాది ఇంకా అప్పులపై ఎటువంటి ప్రకటనా కేంద్రం చేయలేదు. గత ఏడాది కాలంగా ఆర్థిక మాంద్యం, రూపాయి పతనంతో ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూలతలు తీవ్ర ప్రభావమే చూపుతున్నా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న తీరును ఆర్థిక రంగ నిపుణులు ప్రశంసిస్తున్న పరిస్థితి తెలిసిందే. పన్నుల భారాన్ని సీఎం కేసీఆర్ ఆదినుంచీ వ్యతిరేకిస్తూ తాజాగా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబంతో ముడి పెట్టకుని ఉన్న విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఈఆర్సీ ప్రతిపాదించినా సీఎం కేసీఆర్ ఆమోదించలేదు.
నిరుపేదలకు భారంగా చార్జీలు, పన్నుల పెంపు లేకుండా పాలనను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాలకు సైతం విమర్శలకు తావులేని రీతిలో పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, ఇతర భారాలను మోపకుండా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేర్పుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. కేంద్ర నియంత్రణలతో నిధుల కోత ఉన్నప్పటికీ, ఆర్ధిక ఆంక్షలతో అప్పులు పుట్టకపోయినా ఇతర మార్గాల్లో రాబడి సమీకరించుకుంటున్న సర్కార్‌గా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
దాదాపు కోటిన్నర దాటిన కుటుంబాలు, నాలుగున్నర కోట్ల ప్రజల మన్ననలు పొందే విధంగా ముందుచూపు వ్యూహంతో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసలు వ్యక్తమవున్నాయి. ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా పన్నుల పెంపు జోలికి వెళ్లలేదు. కేంద్రం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలతో ప్రజలపై భారం పడినప్పటికీ ఆ మొత్తం కేంద్ర ఖజానాకే సెస్సుల రూపంలో వెళుతోంది. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, పరిశ్రమలు, గృహ వినియోగానికి కోతలులేని నిరంతర కరెంట్ సరఫరాతో సమాజానికి మేలు జరుగుతోంది. గృహ వినియోగదారుల్లో 70 నుంచి 80 శాతానికి పైగా గణనీయమైన సంఖ్యలో రైతులే ఉన్నారు.
పన్నుల పెంపుకు నో…
ఎన్నికల ఏడాది కావడంతో ఈ ఏడాది ఇక కొత్త పన్నుల ఊసు లేకుండా మరిన్ని కొత్త పథకాల అమలుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఏదేమైనా మరిన్ని నూతన పథకాలతో ప్రజలకు చేరవడంలో భాగంగా ఆర్ధిక భారాన్ని కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. అంతిమంగా ప్రజా సంక్షషీఏమమే లక్ష్యంగా ఈ ఏడాదంతా వ్యయాలు ఎక్కువకానున్నాయి. నిత్యం వినూత్నంగా ఆలోచిస్తూ స్వయం సమృద్ధితో ఖజానాను బలోపేతం చేసుకునే దిశలోనే తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో గడచిన తొమ్మిదేళ్లుగా ఏనాడూ ప్రజలపై పన్నుల పెంపుకు సిద్దపడలేదు. మరోవైపు పథకాలకు కోతలు పెట్టకుండా కొత్త పథకాలకు రూపకల్పన చేస్తోంది.
పలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం ఆర్ధికంగా అడగకపోయినా చేయూలనిస్తూ ఆదుకుంటున్న తీరు తెలంగాణపై ఇక ఊహకు కూడా అందని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా నివేదికలను రెడీ చేస్తోంది. కేంద్రంనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత, ఆర్థికమాంద్యం ప్రభావంతో సొంత వనరుల ద్వారా ఆదాయం వివరాలను రెడీ చేస్తోంది. రాష్ట్ర ఆర్థికస్థితి, ఆర్థిక నియంత్రణ, ప్రాజెక్టులకు నాబార్డు రుణాలు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రుణ సేకరణ, ఆదాయం పెంచుకునే మార్గాలు, తప్పనిసరి వ్యయాలు, కోతలు పెట్టాల్సిన అంశాలపై ప్రణాళిక ఖరారు చేయనున్నారు.