Monday, November 25, 2024

మత్స్య సంపద అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట: మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కేంద్రం తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నదని విమర్శించారు. సిద్దిపేటలో పీవీ.నర్సింహారావు పశువైద్య కళాశాల భవన నిర్మాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. మూగజీవాలకు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని చెప్పారు. కేంద్ర మంత్రులు తెలంగాణను ఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీలో తిడతారా అని ప్రశ్నించారు. వెటర్నరీ కాలేజీ సిద్దిపేటకు వచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంతో ఎండా కాలంలోనూ జలసిరి పెరిగి అలుగుపారుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లాలో 12,460 మంది మత్స్యకారులకు కొత్తగా సభ్యత్వం అందించామన్నారు. 3.70 లక్షల మందికి రెండో విడుత గొర్రెలు పంపిణీ చేయనున్నామని తెలిపారు.

అనంత‌రం మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని నిలదీశారు. మత్స్య సొసైటీల్లో 3.72 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. మరో లక్ష మందికి సభ్యత్వం ఇస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరుకు రెండో విడుత గొర్రెల పంపిణీ చేపడుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగో పశు వైద్య కళాశాలను సిద్దిపేటలో ఏర్పాటు చేసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పెరిగిన జీవాల సంఖ్యకు అనుగుణంగా నూతన పశువైద్యులను తీర్చిదిద్దడానికే వెటర్నరీ కాలేజీలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement