న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? అక్కడి ప్రజలు భారతీయులు కారా? ప్రజా సంక్షేమానికి సంబంధించిన కీలక పథకాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎందుకంత వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా గురువారం కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. విభజన హామీలు, ఆహార ధాన్యాల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలని, రైతులకు సంబంధించిన కీలక అంశమైన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాష్ట్రపతి ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావనా లేదనీ అన్నారు.
అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సమగ్రత అంశాలను సమైక్య నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందన్నది వాస్తవమని ఎంపీ నామా విమర్శించారు. కోవిడ్‌తో పాటు దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, ఉపాధి కల్పన లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కనీసం మద్దతు ధర లేక రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా ఏర్పడక ముందు పరిస్థితులను ప్రస్తావించిన నామా… స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికీ తాగు నీరు అందించారన్నారు. కేంద్రం ప్రశంసలు కురిపిస్తోందే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని నామా నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నీతి అయోగ్ సిఫారసుల మేరకు మిషన్ భగీరథకు రూ .19,205 కోట్లు, కాకతీయుల కాలం నాటి చెరువుల అభివృద్ధికి రూ. 5 వేల కోట్లు చొప్పున రెండిటికీ కలిపి 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని 2016లో నీతిఆయోగ్ సిఫారసు చేసినా ఫలితం శూన్యమని వాపోయారు.
రాబోయే రోజుల్లోనైనా ధాన్యం సేకరణకు జాతీయ పాలసీని తీసుకురావాలని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు బంధు పథకం, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ద్వారా అన్నదాతలకు చేయూతనందిస్తున్నామని వెల్లడించారు. పామాయిల్ సాగులో తెలంగాణా నంబర్ వన్‌గా ఉందని, తన నియోజకవర్గంలో రెండు పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, కొత్తగా మరో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును ప్రోత్సహించనున్నామని ఎంపీ నామా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 12 పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామనీ వెల్లడించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, ఇంటింటికీ తాగునీరు వంటి బృహత్తర పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. పత్తి ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీకి నిధుల మంజూరు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదని కేంద్రానికి వివరించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు, 7 ఐఐఎం, 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 84 నవోదయ విద్యాలయాలు, 4 ఎస్ఐడీ మంజూరు చేసినా తెలంగాణాకు ఒక్కటీ ఇవ్వలేదని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 2012-13లో తెలంగాణ ప్రాంతానికి మంజూరై వెనక్కి తీసుకున్న ఐటీఐఆర్‌ను మళ్లీ రాష్ట్రానికి కేటాయించడంపై ఆలోచించాలని సూచించారు. మైనారిటీలు, గిరిజనులు, ఓబీసీలు, ఎస్సీ వర్గీకరణపై రిజర్వేషన్లు కల్పించాలని 2014లోనే శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా నేటికీ నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. .
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,