Friday, November 22, 2024

Delhi | సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డికి చుక్కెదురు.. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు



న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో సోమవారం చుక్కెదురైంది. అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దన్న ఆదేశాలతో పాటు సీబీఐ విచారణ జరపాల్సిన తీరుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దర్యాప్తు సంస్థ ప్రశ్నించాలనుకున్న వ్యక్తికి ప్రశ్నాపత్రాన్ని ముద్రించి అందజేయాలని చెప్పడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది ప్రామాణికంగా మారితే ఇక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను మూసేయడం మంచిదని సుప్రీకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదొక అనవాయితీగా మారి సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొనే ప్రతి ఒక్కరూ ఈ కేసును ఉదాహరణగా తీసుకుంటారని, ప్రశ్నాపత్రాన్ని ముద్రించి ఇవ్వాలని కోరతారని, అలాంటప్పుడు సీబీఐ అవసరం ఏముంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. మొత్తంగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అపరిపక్వంగా, అసమంజసంగా ఉన్నాయని, కేసును తప్పుగా అన్వయించుకుని అసాధారణ ఆదేశాలు జారీ చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ తరహా ఆదేశాలు దర్యాప్తును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని బెంచ్ అభిప్రాయపడింది. అంతిమంగా ఈ తరహా ఆదేశాలు దర్యాప్తుపై దురభిప్రాయాన్ని కలుగజేస్తాయని వ్యాఖ్యానించింది.

వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీత నర్రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సోమవారం ఉదయం సాధారణ కేసుల కంటే ఒక గంట ముందుగానే విచారణ చేపట్టాల్సి ఉండగా, సుప్రీంకోర్టులో మొత్తం ఐదుగురు న్యాయమూర్తులు కోవిడ్-19 బారిన పడడంతో రాజ్యాంగ ధర్మాసనం సహా పలు ధర్మాసనాల్లో మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో సాధారణ కేసుల జాబితాలో 24వ స్థానంలో ఉన్న సునీత పిటిషన్ మధ్యాహ్నం భోజన విరామానికి కాస్త ముందు విచారణకు వచ్చింది. అయితే భోజన విరామం అనంతరం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆ మేరకు మధ్యాహ్నం భోజన విరామం అనంతరం రెండో కేసుగా ఈ కేసు విచారణ చేపట్టగా.. తొలుత సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు.

- Advertisement -

హత్యతో పాటు ఆధారాలు చెరిపేయడంలో పెద్ద కుట్ర దాగుంది

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని పులివెందులలోని ఆయన నివాసంలో హత్య చేయడం, ఆపై రక్తపు మరకలు సహా హత్య జరిగినట్టు తెలిపే ఆధారాలను చెరిపేయడం వెనుక విస్తృత స్థాయి కుట్ర దాగుందని సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా అన్నారు. హత్యానంతరం ఆధారాలు చెరిపేయడంలో గంగిరెడ్డి సహా పలువురు కీలక పాత్ర పోషించారని తెలిపారు. వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకే ఆధారాలు చేరిపేసినట్టు నిందితులు తమ వాంగ్మూలాల్లో తెలియజేశారని వెల్లడించారు. అవినాశ్ రెడ్డి శంకరయ్యకు ఫోన్ చేసి వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పారని, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు కూడా ఇదే సమాచారం ఇచ్చారని వెల్లడించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సీబీఐ అడగబోయే ప్రశ్నలను ముద్రించి అవినాశ్ రెడ్డికి అందజేయాలని చెప్పిందని, ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు.

ఏం అడగబోతున్నారో ముందే చెబితే నిజాలు ఎలా రాబడతారని, విచారణ ఎలా సాధ్యపడుతుందని అన్నారు. ఇలాంటి ఉత్తర్వులను గతంలో తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం సీబీఐ వాదన ఏంటని ప్రశ్నించింది. అయితే సీబీఐ తమ పిటిషన్‌ను పూర్తిగా సమర్థిస్తూ ఏకీభవించిందని లూత్రా చెప్పారు. రెండో ప్రతివాదిగా ఉన్న సీబీఐ కూడా అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. వాదనల్లో భాగంగా సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జిషీటు, ఆ తర్వాత దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటులో పేర్కొన్న అంశాలతో పాటు తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో పొందుపర్చిన కొన్ని అంశాలను లూత్రా చదివి వినిపించారు.

మంగళవారం వరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి

సునీత తరఫు వాదనలు ముగిసిన అనంతరం కేసులో మొదటి ప్రతివాది అవినాశ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. కోర్టుకు తప్పుడు అభిప్రాయం కలిగేలా సునీత తరఫు న్యాయవాది వాదించారని ఆరోపించారు. అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా అప్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పిన వాంగ్మూలం తప్ప మరేదీ లేదని అన్నారు. సీబీఐ సమన్లు జారీచేసిన ప్రతిసారీ ఆయన విచారణకు హాజరవుతున్నారని చెప్పారు. అయితే దర్యాప్తు సంస్థ అడిగిన ప్రశ్నలే అడుగుతుంటే హైకోర్టు ఆ ప్రతులను అందించాలని పేర్కొందన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలను తప్పుగా అన్వయించి చెబుతున్నారని వాదించారు. సీబీఐ ఎప్పుడూ కూడా ప్రశ్నాపత్రాన్ని అవినాశ్ రెడ్డికి ఇవ్వలేదని అన్నారు. జనవరి 23న తొలిసారి అవినాశ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసిందని, అప్పటి నుంచి పిలిచిన ప్రతిసారీ విచారణకు హాజరయ్యారని అన్నారు. చనిపోయిన వ్యక్తి అవినాశ్ రెడ్డికి కూడా బంధువేనని, ఆయన తండ్రికి సోదరుడు అవుతాడని అన్నారు.

ప్రశ్నాపత్రం ముద్రించి అందించాలన్న హైకోర్టు ఆదేశాలు సమంజసంగా లేకపోతే, ఆ నిబంధన ఒక్కటి తొలగిస్తే సరిపోతుందని, మొత్తంగా హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ దశలో ముందస్తు బెయిల్ (యాంటిసిపేటరీ బెయిల్) కోసం చేసుకున్న దరఖాస్తును వెనక్కి తీసుకుంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది. మంగళవారం హైకోర్టులో విచారణ జరిగే వరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాశ్ తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. తాము కేవలం మరో 24 గంటల పాటు అరెస్టు చేయకుండా మినహాయింపు కోరుతున్నామని, ఒకవేళ రేపు హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయకపోతే ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని, సుప్రీంకోర్టును ఆశ్రయించడమా లేక లొంగిపోవడమా అన్నది పరిశీలిస్తామని చెప్పారు.

అరెస్టు ఆపమని చెప్పలేం
ఇప్పటికే సీబీఐ చాలా సంయమనం పాటించింది
——————–
మంగళవారం వరకు అరెస్టు చేయకుండా వెసులుబాటు కల్పించాలన్న అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాదుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దర్యాప్తు సంస్థ అరెస్టు చేయాలనుకుంటే ఎప్పుడో అరెస్టు చేసి ఉండేదని, ఇప్పటికే సీబీఐ చాలా సంయమనం పాటిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు కేసు ప్రస్తుత స్థితిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 30లోగా దర్యాప్తును ముగించాలన్న జస్టిస్ ఎంఆర్ షా బెంచ్ ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు చేసింది. దర్యాప్తు ముగించడానికి గడువును ఏప్రిల్ 30 నుంచి జూన్ 30 వరకు పొడిగిస్తూ ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగులో ఉన్నందున, సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాల ప్రభావం లేకుండా దానిపై ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఆదేశిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement