Tuesday, November 19, 2024

సినిమా హాళ్లు, మద్యం షాపులపై ఆంక్షలు విధించండి: హైకోర్టు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల పరిస్థితిపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనాపై తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన నివేదిక సమర్పించాలని మంగళవారం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించగా.. ఈరోజు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. మద్యం దుకాణాలు కరోనా వనరులుగా మారాయని ఘాటుగా వ్యాఖ్యానించింది మద్యం షాపులు, పబ్బులు, క్లబ్బులు, సినిమా హాళ్లపై ఆంక్షలు విధించాలని ఈ సందర్భంగా హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. అటు టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని పేర్కొంది. లాక్‌డౌన్ లేకపోయినా.. కంటైన్‌మెంట్ జోన్లు కచ్చితంగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? ఎంత వేస్టేజ్ అయిందో చెప్పాలని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో మళ్లీ నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.

కాగా శుక్రవారం ‘వకీల్ సాబ్’ విడుదల ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు విధిస్తుందో వేచి చూడాలి. అటు మద్యం షాపులు, పబ్బులు, బార్‌ల పని వేళలను ప్రభుత్వం సవరించే అవకాశముందని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా 16వేల మందికి జ‌రిమానా విధించిన‌ట్లు కోర్టుకు తెల‌ప‌గా… ఒక్క‌సారి పాత‌బ‌స్తీకి వెళ్లి చూస్తే ల‌క్ష‌ల మంది దొరుకుతార‌ని కామెంట్ చేసింది. క‌రోనా ఆంక్ష‌లు అమ‌ల‌య్యేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా ఆంక్ష‌లు ఉల్లంఘించిన వారిపై 22 వేల కేసులు, భౌతిక దూరం పాటించని వారిపై 2,416, రోడ్లపై ఉమ్మిన వారిపై ఆరు కేసులు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement