Friday, November 22, 2024

తెలంగాణ హైకోర్టు ముంగిట గంగిరెడ్డి బెయిల్ కేసు.. సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ముందుకొచ్చింది. గంగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశంపై విచారణ జరపాలని జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. గంగిరెడ్డికి సీఆర్పీసీ సెక్షన్ 167(2) ప్రకారం డిఫాల్ట్ బెయిల్ లభించిందని, ఆ తర్వాత దాఖలు చేసిన చార్జిషీట్లో గంగిరెడ్డి తీవ్రమైన నేరానికి పాల్పడిన అభియోగాలు (నాన్ బెయిలబుల్) ఉన్నప్పుడు బెయిల్ రద్దు చేసే అంశాన్ని మెరిట్స్ ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ తొలుత సీబీఐ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

- Advertisement -

గంగిరెడ్డిని అరెస్టు చేసిన 90 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేయలేదన్న కారణంతో అతనికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది. అయితే ఆ తర్వాత కేసు విచారణ సీబీఐ చేతికి రావడంతో గంగిరెడ్డికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు చూపుతూ చార్జిషీటు దాఖలు చేసింది. అనంతరం బెయిల్ రద్దు చేయాలంటూ తొలుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే డిఫాల్ట్ బెయిల్ మంజూరైన తర్వాత ఆ బెయిల్ రద్దు చేయడం కుదరదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గంగిరెడ్డి విచారణకు సహకరించకపోగా విఘాతం కల్గిస్తున్నాడని ఆరోపించింది. సాక్షులను బెదిరించడం, సాక్ష్యాధారాలను మాయం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నందున అతనికి మంజూరైన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది.

ఇదే సమయంలో వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్‌లో సజావుగా సాగే పరిస్థితి లేదని, సాక్షులతో పాటు దర్యాప్తు అధికారులను సైతం బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ వివేకా కుమార్తె సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు తొలుత ఆ పిటిషన్ విచారణ చేపట్టింది. వాదోపవాదాల అనంతరం కేసు విచారణను తెలంగాణలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది. తాజాగా గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చేపట్టిన ధర్మాసనం ఒకవేళ బెయిల్ వ్యవహారంపై పునర్విచారణకు ఆదేశిస్తే ఏ రాష్ట్రంలోని హైకోర్టుకు పంపాలని సీబీఐని అడిగింది. ట్రయల్ కోర్టు విచారణ తెలంగాణకు బదిలీ చేసినందున, బెయిల్ రద్దు వ్యవహారాన్ని కూడా ఆ రాష్ట్ర హైకోర్టుకే బదిలీ చేయాలంటూ సీబీఐ ధర్మాసనాన్ని కోరింది. దీంతో సోమవారం ఇచ్చిన తీర్పులో గంగిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు మొదటి నుంచి విచారణ జరపాలని, ఈ క్రమంలో చట్ట ప్రకారం మెరిట్స్ ఆధారంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement