న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గడచిన నాలుగేళ్లుగా జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధులు విడుదల చేయలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అస్సాం రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గత కొన్నేళ్లలో విడుదల చేసిన ఎన్డీఆర్ఎఫ్ నిధుల పట్టికను అనుబంధంగా పొందుపరిచారు. దేశవ్యాప్తంగా 2018-19 నుంచి 2022-23 వరకు రూ.44,182.65 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. 2020 నుంచి ఇప్పటివరకు రూ.15,652.15 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు.
2021-22లో బీహార్ కు రూ.1,038.96 కోట్లు, గుజరాత్ కు రూ.1,000 కోట్లు, కర్నాటకకు రూ.1,623 కోట్లు, మధ్యప్రదేశ్ రూ. 600.50 కోట్లు విడుదల చేసినట్టు పట్టికలో పేర్కొన్నారు. అయితే ఈ జాబితాలో గత నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఈ ఖాతా నుంచి ఎలాంటి నిధులు విడుదలైనట్టుగా లేదు. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వరదలు సహా మరికొన్ని ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరుతూ అనేక ప్రతిపాదనలు పంపించినప్పటికీ కేంద్రం ఎలాంటి సహాయం అందించలేదని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.