న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘అమృత్ సరోవర్’ పథకం ప్రకారం నిర్దేశించిన లక్ష్యాన్ని తెలంగాణ సహా దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేరుకోలేకపోయాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, తమిళనాడు, హర్యానా, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు మినహా దేశంలోని మిగతా రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో 75 అమృత్ సరోవర్లను అభివృద్ధి చేసే లక్ష్యం పూర్తయిందని వెల్లడించింది.
పథకంలో భాగంగా 1,12,277 అమృత్ సరోవర్లను గుర్తించగా, వాటిలో 81,425 అమృత్ సరోవర్ల కోసం పని ప్రారంభమమైందని, 66,278 అమృత్ సరోవర్లు పూర్తయ్యాయని కేంద్రం తెలిపింది. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 అమృత్ సరోవర్‌లను నిర్మించడం లేదా అప్పటికే ఉన్న చెరువులు, తటాకాలను పునరుజ్జీవింపజేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 24న ఈ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్థిరమైన నీటి వనరులను ఏర్పాటుచేసుకునే లక్ష్యంతో మిషన్ అమృత్ సరోవర్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు.
ఈ మిషన్‌లో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు భూవనరుల శాఖ, తాగునీరు, పారిశుద్ధ్య శాఖ, జలవనరుల శాఖ, పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ, అటవీ శాఖ, పర్యావరణం మరియు వాతావరణ మార్పుల శాఖ, రైల్వే శాఖ, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వంటి మొత్తం 8 కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఉన్నాయి. అలాగే భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ ఈ మిషన్‌కు సాంకేతిక భాగస్వామిగా పనిచేస్తోంది.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథఖం, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కాంపోనెంట్ వంటి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన సబ్ స్కీమ్‌లు, రాష్ట్ర ప్రభుత్వాల సొంత పథకాలతో పాటు ‘హర్ ఖేత్ కో పానీ’ వంటి వివిధ పథకాలు ఇందులో భాగంగా ఉన్నాయి. అయితే జిల్లాకు 75 అమృత్ సరోవర్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు అందుకోలేకపోయాయని కేంద్రం వెల్లడించింది.