Tuesday, November 26, 2024

Spl Story : ‘హరిత’ శోభితం !

  • 9వ విడత హరితహారంకు మొక్కలు రెడీ
  • 19 నుంచి హరితోత్సవ కార్యక్రమం
  • దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మొక్కలు నాటాలని నిర్ణయం
  • జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు
  • ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో 5 వేల మొక్కలు సిద్ధం

(ప్రభ న్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌) : రాష్ట్ర ప్రభుత్వం ఏటా వర్షాకాలంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంకు మొక్కలను సిద్ధం చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 19న హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 9వ విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలో ఈసారి 40 లక్షల మొక్కలను హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ఇందుకు జిల్లా యంత్రాంగం గత ఆరు మాసాలుగా కసరత్తు చేస్తోంది. అటవీశాఖతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో భారీగా నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలోని గ్రామాలలో హరిత శోభితం వెల్లువిరుస్తోంది. హరితహారం కార్యక్రమంతో పల్లెలు.. పట్టణాలు మరింత పచ్చబడే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అటవీ విస్తీర్ణంను పెంచడంతో పాటు పచ్చదనంను 24 శాతం నుంచి 33 శాతంకు పెంచేందుకు హరితహారం పేరిట భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2015లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిఏటా హరితహారంలో కోట్ల సంఖ్యలో మొక్కలను నాటుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రకారం హరితహారం పథకం కింద 230 కోట్ల మొక్కలను పదేళ్ల వ్యవధిలో నాటాలి. ఇందులో భాగంగా ప్రతిఏటా పెద్ద సంఖ్యలో మొక్కలను నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేస్తున్నారు. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 28 శాతంకు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ గుణాంకాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని పల్లెలు.. పట్టణాలు పచ్చటి అందాలతో కనువిందు చేస్తున్నాయి. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తుండడంతో అన్ని జిల్లాలలో చిత్తశుద్ధితో పథకం అమలు జరుగుతోంది.

ప్రతిఏటా వర్షాలు ప్రారంభమైన వెంటనే హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమంను ప్రభుత్వం చేపడుతుంది. సాధారణంగా జూన్‌ మాసంలో కార్యక్రమం చేపడుతుతారు. గత వారం రోజులుగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 19న హరితోత్సవం కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. అదే రోజు పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలని సంకల్పించారు. అదే రోజు నుంచి హరితహారం కార్యక్రమంను కూడా లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి జిల్లాలో 40 లక్షల మొక్కలను హరితహారం కార్యక్రమం కింద నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు మొక్కలను నాటేందుకు జిల్లా అధికారులు గత ఆరుమాసాలుగా కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు.

- Advertisement -

జిల్లాలోని దాదాపు 566 గ్రామ పంచాయతీలలో నర్సరీలను ఏర్పాటు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నర్సరీలను పర్యవేక్షిస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీలో భాగంగా నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 5 వేల మొక్కలను పెంచుతున్నారు. గత వేసవి కాలం నుంచి మొక్కల పెంపకం జరుగుతోంది. ఈసారి పండ్ల మొక్కలను ఎక్కువగా హరితహారం కింద నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నర్సరీలలో దాదాపు 25 లక్షల మొక్కలను పెంచుతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 13 లక్షల మొక్కలను పెంచుతున్నారు. అయితే జిల్లాలో ఈసారి 40 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో అన్ని ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలను జిల్లా అధికారులు నిర్దేశించారు. గ్రామాలలో 25 లక్షల మొక్కలను నాటాలని..పట్టణ ప్రాంతాలలో 2 లక్షల మొక్కలను నాటాలని యోచిస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన అటవీ ప్రాంతాలలో మొక్కలను నాటుతారు. ఇప్పటికే హరితహారం కింద గ్రామాలలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారాయి. గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్లతో పాటు ప్రధాన రోడ్డు మార్గాలలో పెద్ద ఎత్తున మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. దీంతో ఆయా మార్గాలలో పచ్చదనం వెల్లువిరుస్తోంది. ఈసారి జిల్లాలో హరితహారం కింద అదనంగా 40 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించడంతో గ్రామాలు, పట్టణాలు మరింత పచ్చదనంను సంతరించుకోనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement