Wednesday, November 20, 2024

బంగ్లాదేశ్ కంటే భారత్ వృద్ధిరేటు తక్కువ: మంత్రి హరీశ్ రావు

టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికవృద్ధి సాధిస్తోంద‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపయిందని చెప్పారు. జీఎస్‌డీపీలో దేశంలో మూడో స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వ పాల‌న‌లో భార‌త‌ ఆర్థిక వృద్ధి బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉందని విమ‌ర్శించారు. భారత్‌ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయమే ఎక్కువని గుర్తు చేశారు.

తెలంగాణ మాత్రం ఆర్థిక వృద్ధిని సాధిస్తూ దూసుకుపోతోంద‌ని మంత్రి హరీశ్ రావు తెలిపారు.  రాష్ట్రం 11.7 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632గా ఉందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే 1.84 రెట్లు ఎక్కువ అని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏడాది ఒక శాతం జీడీపీ పెరుగుతున్నదని వెల్లడించారు. గ‌త‌ ఏడేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుప‌డ్డాయ‌ని తెలిపారు. ఆరేళ్లలో దేశం 8 శాతం వృద్ధి రేటు సాధించిందని, దేశం కంటే తెలంగాణ 3 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించింద‌ని చెప్పారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైందని ఆయ‌న తెలిపారు. తలసరి ఆదాయాన్ని చూస్తే ఎవరి పనితీరు ఏందో ప్రజల ముందు ఉదని దీనికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పన్నువసూళ్లలో 11.52 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో దేశం వృద్ధిరేటు 3.6 శాతం అయితే.. తెలంగాణ వృద్ధి రేటు 14.3 శాతమన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దాదాపు 30 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే కోతలు లేని కరెంటు ఇచ్చే రాష్ట్రంగా ఎదిగామన్నారు. పరిశ్రమలు, సర్వీస్‌, నిర్మాణ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారు. కేంద్రానికి ఇచ్చే నిధులు ఎక్కువ.. కేంద్రం మనకు ఇచ్చేది తక్కువ అని విమర్శించారు.  సీఎం కేసీఆర్‌ అవలంభించే విధానాలతోనే తెలంగాణ వృద్ధిరేటు పెరుగుతున్నదని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement